రైడర్స్‌‌కు చెన్నై బ్రేక్.. 7 వికెట్లతో సీఎస్కే గెలుపు

రైడర్స్‌‌కు చెన్నై బ్రేక్.. 7 వికెట్లతో సీఎస్కే గెలుపు
  • రాణించిన జడేజా, రుతురాజ్

చెన్నై:  గత రెండు మ్యాచ్‌‌ల్లో ఓడిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌‌ హోమ్ గ్రౌండ్‌‌లోకి తిరిగి రాగానే అదరగొట్టింది. చెపాక్‌‌ స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్‌‌లోనూ గెలిచింది. గత పోరులో ఐపీఎల్ సెకండ్ బెస్ట్ స్కోరు చేసి..వరుసగా మూడు విక్టరీలతో దూసుకెళ్తున్న  కోల్‌‌కతా నైట్ రైడర్స్‌‌ జోరుకు బ్రేక్ వేసింది.  రవీంద్ర జడేజా (3/18), తుషార్ దేశ్‌‌పాండే (3/33) సూపర్ బౌలింగ్‌‌కు తోడు కెప్టెన్‌‌ రుతురాజ్ గైక్వాడ్ (58 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 67 నాటౌట్‌‌) ఫిఫ్టీతో సత్తా చాటడంతో  సోమవారం జరిగిన మ్యాచ్‌‌లో సీఎస్కే 7  వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌‌ను ఓడించింది. 

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన కోల్‌‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 137/9 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34), సునీల్ నరైన్ (27) టాప్‌‌ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో జడేజా, తుషార్‌‌‌‌తో పాటు ముస్తాఫిజుర్ రహ్మన్ రెండు వికెట్లతో రాణించాడు. ఛేజింగ్‌‌లో చెన్నై 17.4 ఓవర్లలోనే 141/3 స్కోరు చేసి గెలిచింది. రుతురాజ్‌‌తో పాటు శివం దూబే (18 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 28) రాణించాడు.  జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

జడ్డూ, తుషార్ దెబ్బ

గత మ్యాచ్‌‌లో భారీ స్కోరు చేసిన కేకేఆర్ ఈసారి చెపాక్ వికెట్‌‌పై బోల్తా కొట్టింది. ఇన్నింగ్స్ తొలి బాల్‌‌కే ఫిల్ సాల్ట్‌‌ (1)ను గోల్డెన్ డకౌట్ చేసిన తుషార్ చెన్నైకి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. తుషార్ తర్వాతి ఓవర్లో నరైన్ 4, 6తో స్పీడు పెంచాడు. తీక్షణ ఓవర్లో  వన్‌‌డౌన్ బ్యాటర్ అంగ్‌‌క్రిష్ రఘువంశీ (24), నరైన్ చెరో సిక్సర్ కొట్టి స్కోరు 50 దాటించారు. దాంతో కేకేఆర్ కోలుకున్నట్టు కనిపించింది. అయితే, పవర్‌‌‌‌ ప్లే ముగిసిన వెంటనే బౌలింగ్‌‌కు దిగిన జడేజా 8 బాల్స్‌‌లో మూడు వికెట్లు తీసి ఆ టీమ్‌‌ను దెబ్బమీద దెబ్బ కొట్టాడు. 

తన తొలి బాల్‌‌కే రఘువంశీని ఎల్బీ చేసి రెండో వికెట్‌‌కు 56 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు. ఐదో బాల్‌‌కు నరైన్.. తీక్షణకు క్యాచ్ ఇవ్వడంతో కేకేఆర్‌‌‌‌ డీలా పడింది. తన తర్వాతి ఓవర్లోనే హిట్టర్ వెంకటేశ్‌‌ అయ్యర్ (3)ను సైతం ఔట్ చేశాడు. ఇంకో ఎండ్‌‌లో తీక్షణ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో 33 బాల్స్‌‌లో కోల్‌‌కతా ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేకపోయింది. శ్రేయస్, రమణ్‌‌దీప్ (13) క్రీజులో ఇబ్బంది పడ్డారు. 

తీక్షణ వేసిన 12వ ఓవర్లో సిక్స్ కొట్టిన రమణ్‌‌దీప్ తర్వాతి బాల్‌‌కే బౌల్డ్ అవ్వడంతో కేకేఆర్ 85/5తో నిలిచింది. హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ (9) సైతం షాట్లు ఆడలేకపోయాడు. 17వ ఓవర్లో ఫుల్ స్లో బాల్‌‌తో అతడిని తుషార్ బౌల్డ్ చేశాడు. ఆండ్రీ రస్సెల్ (10) రెండు ఫోర్లు కొట్టి తుషార్ బౌలింగ్‌‌లోనే ఔట్‌‌ అయ్యాడు. చివరి ఓవర్లో శ్రేయస్‌‌, స్టార్క్ (0)ను ఔట్ చేసిన ముస్తాఫిజుర్‌‌‌‌ రెండే రన్స్‌‌ ఇవ్వడంతో కేకేఆర్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది.

రుతురాజ్ ఫిఫ్టీ

సొంతగడ్డపై చిన్న టార్గెట్‌‌ను చెన్నై ఈజీగా చేజ్‌‌ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌‌ టీమ్‌‌ను ముందుండి నడిపించాడు. స్టార్క్ వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన ఓపెనర్ రచిన్ రవీంద్ర (15)ను తర్వాతి  ఓవర్లో వైభవ్ అరోరా పెవిలియన్ చేర్చి కేకేఆర్‌‌‌‌కు బ్రేక్ ఇచ్చాడు. కానీ, ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన గైక్వాడ్.. అనుకూల్ రాయ్ వేసిన ఐదో ఓవర్లో మూడు ఫోర్లతో ఒక్కసారిగా స్పీడు అందుకున్నాడు. వైభవ్‌‌ ఓవర్లోనూ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో పవర్‌‌‌‌ ప్లేలో సీఎస్కే 52/1తో నిలిచింది. 

క్రీజులో కుదురుకునేందుకు కాస్త టైమ్ తీసుకున్న డారిల్ మిచెల్ (25)  ఏడో ఓవర్లో స్పిన్నర్ నరైన్‌‌కు 6, 4తో స్వాగతం పలికాడు.  తర్వాతి 3 ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో సగం ఓవర్లకు సీఎస్కే 81/1తో నిలిచింది. రసెల్ బౌలింగ్‌‌లో బౌండ్రీతో మళ్లీ వేగం పెంచిన రుతురాజ్ 45 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. డారిల్ మిచెల్‌‌ను నరైన్ బౌల్డ్‌‌ చేసినా.. ఇంపాక్ట్ ప్లేయర్ శివం దూబే తన ఇంపాక్ట్ చూపెట్టాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన దూబే మ్యాచ్‌‌ను వన్‌‌సైడ్ చేశాడు. వైభవ్‌‌ ఓవర్లోనూ మరో భారీ సిక్స్‌‌ కొట్టి తర్వాతి బాల్‌‌కే బౌల్డ్‌‌ అయ్యాడు. విజయానికి 3 రన్స్ అవసరం అయిన దశలో క్రీజులోకి వచ్చిన ఎంఎస్‌‌ ధోనీ (1 నాటౌట్‌‌) మూడు బాల్స్‌‌లో సింగిల్‌‌ మాత్రమే తీయగా.. రుతురాజ్ విన్నింగ్ ఫోర్ కొట్టాడు. 

సంక్షిప్త స్కోర్లు


కోల్‌‌కతా: 20 ఓవర్లలో 137/9 (శ్రేయస్ 34, నరైన్ 27, జడేజా 3/18, తుషార్ 3/33)
చెన్నై: 17.4 ఓవర్లలో 141/3  (రుతురాజ్ 67*, దూబే 28, వైభవ్ 2/28).