మమ్మల్ని చూసి ఈల వేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు ఈగలు తోలుకుంటు వెళ్లిపోయారు..

మమ్మల్ని చూసి ఈల వేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు ఈగలు తోలుకుంటు వెళ్లిపోయారు..

Ishan Kishan: 2016 సీన్‌ను రిపీట్ చేస్తూ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందని ఆశించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఎలిమినేటర్‌తోనే ముగిసిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక పోరులో 47 రన్స్ తేడాతో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కానీ, ఈ ఓటమితో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు తీవ్ర నిరాశలో ఉండగా, ప్రత్యర్థి జట్ల ఫ్యాన్స్.. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సన్‌రైజర్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను టార్గెట్ చేస్తూ చెన్నై ఫ్యాన్స్ రీసౌండ్ వచ్చేలా ట్రోల్స్ చేస్తున్నారు.

చెపాక్ లో మొదలైన ‘ఈల’ గోల: 
ఈ తీవ్రమైన ట్రోలింగ్ వెనుక ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. లీగ్ దశలో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వీరోచితంగా ఆడి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇషాన్ స్టేడియంలో ఉన్న చెన్నై అభిమానుల వైపు చూస్తూ నోట్లో వేలు వేసి ఈల వేశాడు. అంతేకాదు, ‘ఇక చాలు.. మ్యాచ్ అయిపోయింది, లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్లండి’ అనే మీనింగ్ వచ్చేలా సైగలు చేశాడు. అప్పట్లోనే కిషన్ ప్రవర్తనపై చెన్నై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డాడు. లీగ్ దశలోనే చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించగా, హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.  

ఎలిమినేటర్‌లో ఓటమి: 
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 రన్స్ చేసింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించగా, ధ్రువ్ జురెల్ (51) రాణించాడు. ఆ తర్వాత 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (38), సలీల్ అరోరా (35) పోరాడారు. ఇషాన్ కిషన్ సైతం కేవలం 11 బంతుల్లోనే 33 రన్స్ చేసి ఊపుమీద కనిపించాడు. కానీ, ఆ తర్వాత ఒక అనవసరపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఇషాన్ అవుట్ కావడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది, చివరకు హైదరాబాద్ ఓడిపోయింది. 

నీ కథ ముగిసింది.. ఇప్పుడు ఇంటికి వెళ్లిపో: 
ఎలిమినేటర్‌లో హైదరాబాద్ కూడా ఓడిపోవడంతో ఇషన్ కిషన్ ని చెన్నై ఫ్యాన్స్‌ గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు. చెపాక్‌లో ఇషాన్ చేసిన సైగలను గుర్తు చేస్తూ.. "ఇప్పుడు నీ కథ ముగిసింది.. ఈల వేసుకుంటూ నువ్వు ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్లు" అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కిషన్‌తో పాటు మరో స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను కూడా చెన్నై ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ రివెంజ్ ట్రోలింగ్ మీమ్స్, పోస్ట్‌లతోనే నిండిపోయింది.