రాష్ట్రంలో పడిపోయిన ఆయిల్ సీడ్స్ సాగు

రాష్ట్రంలో పడిపోయిన ఆయిల్ సీడ్స్ సాగు
  • యాసంగిలో 90 వేల ఎకరాల్లో తగ్గిన పంటలు
  • 68 వేల ఎకరాల్లో తగ్గిన పల్లీ పంట
  • నువ్వులు, పొద్దు తిరుగుడు అంతంత మాత్రమే
  • నూనెల ధరలు పెరిగే చాన్స్​ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఆయిల్​ సీడ్స్​సాగు గణనీయంగా పడిపోయింది. ప్రతి ఏటా రైతులు నూనె గింజల పంటలైన వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, కుసుమలు, ఆముదం సాగును తగ్గిస్తున్నారు. గత ఐదేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈయేడు ఒక్క యాసంగిలోనే  90 వేల ఎకరాల్లో ఈ పంటల సాగు తగ్గింది. వర్షాలు లేక నీటి ఎద్దడి తలెత్తి ఆయిల్‌‌‌‌ సీడ్స్‌‌‌‌ పంటలను భారీగా దెబ్బతీసింది. సాగు తగ్గడంతో పంట దిగుబడి తగ్గుతూ వస్తోంది. ఫలితంగా రానున్న రోజుల్లో ఆయిల్​​ధరలు పెరిగే చాన్స్​ఉంది. ఇప్పటికే దేశంలోకి భారీగా వంట నూనెల దిగుమతి జరుగుతోంది. మరింత పెరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

భారీగా పడిపోయిన సాధారణ సాగు

రాష్ట్రంలో ఈ యాసంగి పంటల్లో నూనె గింజల సాగు భారీగా తగ్గింది. ఆయిల్​ సీడ్స్​సాధారణ సాగు 3.71 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు యాసంగిలో 2.81లక్షల ఎకరాల్లోనే రైతులు సాగు చేశారు. 90 వేల ఎకరాల్లో పంటలు వేయలేదు. పల్లీ (వేరుశనగ) సాధారణ సాగు 2.77 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు 2.09 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. సాధారణ సాగు కంటే 68 వేల ఎకరాలు తగ్గింది. నువ్వులు 51,901 ఎకరాలకు గాను.. 33,608 ఎకరాల్లోనే సాగయ్యాయి. 22,122 ఎకరాల్లోనే పొద్దు తిరుగుడు సాగైంది. కుసుమలు 10 వేల ఎకరాల్లోనే వేశారు. మిగతా అయిల్​ సీడ్స్​ అన్నీ  10,791 ఎకరాలకు గానూ.. 1,184 ఎకరాల్లో సాగయ్యాయి.

ఏటా 3.4 లక్షల టన్నుల కొరత

రాష్ట్రంలో  ఏడాదికి తలసరి నూనెల వినియోగం 16 కేజీల నుంచి 19 కేజీల వరకు ఉంటోంది. అంటే.. ప్రజల అవసరాల కోసం 6.4 లక్షల టన్నుల వంట నూనెలు అవసరమయ్యే అవకాశం ఉంది. కానీ, ఏటా 3.4 లక్షల టన్నుల నూనె మాత్రమే ఉత్పత్తి అవుతున్నది.  ఇంకా 3 లక్షల టన్నుల కొరత ఏర్పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని అధిగమించేందుకు కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఇతర దేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా 21 మిలియన్‌‌‌‌ టన్నుల వంట నూనె అవసరం ఉంది. ప్రస్తుతం దేశంలో 7 మిలియన్‌‌‌‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 15 మిలియన్‌‌‌‌ టన్నుల నూనెను కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్లు ఖర్చు చేసి దిగుమతి చేసుకుంటోంది.

2023-24 యాసంగి సీజన్‌‌‌‌లో ఆయిల్ ​సీడ్స్​ సాగు వివరాలు


పంట    ఎకరాలు
వేరుశనగ    2,09,957
నువ్వులు     33,608
పొద్దు తిరుగుడు     22,122
కుసుమలు    10,454 
ఇతర ఆయిల్ ​సీడ్స్    1,184