పెరుగు.. మజ్జిగ.. ఏది బెటర్‌‌‌‌?

పెరుగు.. మజ్జిగ.. ఏది బెటర్‌‌‌‌?

రోజూ తినే ఆహారం ఆకలిని తీరుస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆహారం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అనారోగ్యం బారిన పడొచ్చు. పెరుగు, మజ్జిగ శరీరానికి రెండు రకాల ప్రయోజనాలను అందిస్తాయి. కాకపోతే వాటిని సరైన టైంలో తీసుకుంటేనే కావాల్సిన హెల్త్‌‌ బెనిఫిట్స్ శరీరానికి అందుతాయి.  

‘పాల నుండి పెరుగు వస్తుంది. పెరుగు నుండే కదా మజ్జిగ వచ్చేది. అయినా వీటిలో వేరు వేరు పోషకాలు ఉన్నాయి. వేరు వేరు హెల్త్‌‌ బెనిఫిట్స్‌‌ ఉన్నాయి అంటారేంటి’ అనుకుంటున్నారా? పెరుగు చిలికినపుడు దాంట్లో ఉన్న కొవ్వు, ఇతర పదార్థాలన్నీ వేరైపోయి వాటివల్ల కలిగే హెల్త్‌‌ బెనిఫిట్స్‌‌ మారతాయి. పెరుగు, మజ్జిగ రెండూ ఒకటే అనుకుంటారు చాలామంది. కొందరికి మజ్జిగ తాగగానే తిన్న ఆహారం అరుగుతుంది. కడుపులో మంట లాంటివి ఉంటే పోతాయి. కొందరికేమో పెరుగు తిన్నా అరగదు. దానికితోడు తేన్పులు వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే...  

వీటిలో ఉండే పోషకాలు

పెరుగు, మజ్జిగ రెండింట్లోనూ పోషకాలు చాలా ఉంటాయి. మజ్జిగలో క్యాల్షియం, విటమిన్ బి12, జింక్, రైబోఫ్లేవిన్‌‌, ప్రొటీన్స్‌‌తో పాటు చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల పెరుగుదలకు సాయపడతాయి. హైకొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్‌‌ను నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్‌‌ బి12, బి5, బి2, పొటాషియం, ప్రొటీన్స్‌‌ ఉంటాయి. ఈ పోషకాలు రక్తపోటు, గుండె జబ్బులను తగ్గిస్తాయి. పెరుగు తింటే దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటితో పాటు ఒత్తిడి, ఆందోళనలను కూడా తగ్గిస్తుందని చెప్తున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.

జీర్ణక్రియపై వీటి ప్రభావం 

పెరుగు తినడం మంచిదే. కానీ ఇది జీర్ణం కావడం కష్టం. అందుకే పెరుగు తిన్నతరువాత కొంతమందికి సరిగ్గా అరగదు. దాంతో పేగుల్లో పులిసిపోయి కడుపులో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేవాళ్లే పెరుగు తినడం మంచిది. తిన్న ఆహారం అరగడానికి బాగా పనిచేస్తుంది మజ్జిగ. ఏదైనా మసాలా ఫుడ్‌‌ తిన్నపుడు కడుపులో మంటగా అనిపిస్తే.. దాన్ని తగ్గించేందుకు మజ్జిగ సాయపడుతుంది.  హైపర్‌‌ఎసిడిటీ, ఐబిఎస్‌‌ (ఇరిటబుల్‌‌ బోవెల్‌‌ సిండ్రోమ్‌‌), కడుపులో ఇన్ఫెక్షన్స్‌‌కు చికిత్సగా మజ్జిగ పనికొస్తుంది.

బరువు మీద ఎఫెక్ట్​

పెరుగుతో పోల్చితే మజ్జిగలో కొవ్వు, క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వాళ్లకు మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల మజ్జిగలో 40 క్యాలరీస్‌‌ ఉంటే 100 గ్రాముల పెరుగులో 98 క్యాలరీస్‌‌ ఉంటాయి. బరువు పెరగాలనుకున్న వాళ్లకు పెరుగు మంచిది. మజ్జిగ పేగులను శుభ్రపరుస్తుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. ఇందులో ఎక్కువగా నీళ్లు, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్‌‌ ఉంటాయి కనుక పెరుగు కంటే మజ్జిగ మంచి హైడ్రేటర్‌‌‌‌గా పనిచేస్తుంది. అందుకే సమ్మర్‌‌‌‌లో రీహైడ్రేషన్‌‌ పొందడానికి మజ్టిగ తాగుతుంటారు.

ఇవి తినడానికి సరైన టైం 

సరైన టైంలో సరైన ఫుడ్‌‌ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో చెప్పినట్టు రాత్రిపూట పెరుగు తినొద్దు. జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తున్నపుడు... అంటే మధ్యాహ్నంలో పెరుగు తినడం మంచిది. రోజులో ఏ టైంలో అయినా మజ్జిగ తాగొచ్చు. టిఫిన్‌‌ తినడానికి పావుగంట ముందు మజ్జిగ తాగడం ఇంకా మంచిది.  ఎందుకంటే కడుపులో ఏమైనా సమస్యలుంటే పోతాయి.