
బషీర్‌బాగ్, వెలుగు: రద్దయిన నోట్ల మార్పిడికి యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ముల్లా అబ్బాస్ అలీ ఎలక్ట్రీషియన్. రద్దయిన నోట్లను చెల్లుబాటు అవుతాయని నమ్మిస్తూ.. అమాయక ప్రజలకు 30 శాతం కమీషన్ పై వాటిని మార్పిడి చేసేవాడు.
2021లో ఇలాగే చేస్తూ కర్నాటకలో పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు వెళ్లొచ్చాక కూడా ఇదే పని చేస్తున్నాడు. కేరళకు చెందిన అజీజ్ వద్ద రూ.1.92 కోట్ల రద్దయిన నోట్లు కొనుగోలు చేశాడు. గత నెలలో హైదరాబాద్ వచ్చి అతనికి పరిచయం ఉన్న తంగేళ్ల కృష్ణమోహన్‌తో కలిసి ఆ నోట్లను విక్రయించాలనుకున్నాడు.
ఈ క్రమంలో బంజారాహిల్స్ కు చెందిన మన్నెల్లి రాజ్ కుమార్, యాద జయకవిత గుప్త వాటిని తీసుకునేందుకు ముందుకొచ్చారు. రూ.కోటి రద్దయిన నోట్లకు రూ.30 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. సోమవారం నారాయణగూడలో డబ్బుల మార్పిడి జరుగుతున్నట్లు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి వెళ్లి ఆ నలుగురిని పట్టుకున్నారు.
రద్దయిన నోట్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని వారిని నారాయణగూడ పోలీసులకు అప్పగించినట్లు అడిషనల్కమిషనర్తెలిపారు. రద్దయిన నోట్లలో రూ.2.5 లక్షలు రూ.500 నోట్లు, మిగతావి రూ.1,000 నోట్లని చెప్పారు. నలుగురు నిందితులను అరెస్ట్చేశామని, అజీజ్పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.