
- మెయింటెనెన్స్‌తో సమస్యలను అధిగమించిన విద్యుత్ సంస్థలు
- తగ్గిన ట్రిప్పింగ్, లో వోల్టేజీ, ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్స్
- గతంలో కంటే 38 శాతం తగ్గిన బ్రేక్ డౌన్ లు
- పీక్ డిమాండ్ వచ్చినా మెరుగైన కరెంటు సప్లైకి ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకునేలా విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. సకాలంలో తగిన చర్యలు చేపడుతుండటం వల్లే రాష్ట్రవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కరెంటు వాడకం పెరిగినా అందుకు అనుగుణంగా కరెంటు సరఫరా సాధ్యమవుతోందని విద్యుత్ సంస్థల సిబ్బంది చెప్తున్నారు. విద్యుత్ లోడ్ పెరిగినప్పుడు తలెత్తే బ్రేక్ డౌన్ లు, కరెంటు లైన్ల ట్రిప్పింగ్, ట్రాన్స్ ఫార్మర్ వైఫల్యాల వంటి సమస్యలను అధిగమిస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో పాటు లో వోల్టేజ్ సమస్యలను కూడా అధిగమించినట్లు విద్యుత్ సంస్థల అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
బ్రేక్ డౌన్ లు తగ్గినయ్
ఇటీవల రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 15,623 మెగావాట్ల విద్యుత్ పీక్ డిమాండ్ నమోదైంది. దీనికి తగ్గట్టుగా రికార్డు స్థాయిలో 303.6 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా జరిగింది. ఇంత పీక్ డిమాండ్ వస్తే ట్రాన్స్‌ఫార్మర్లు సబ్‌స్టేషన్లు ట్రిప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ముందస్తు ఏర్పాట్లతో ఈ సమస్య నుంచి విద్యుత్ సంస్థలు కొంత మేరకు గట్టెక్కాయి.
ఫలితంగా ఒక్క ఎన్పీడీసీఎల్ పరిధిలో 2023 జనవరి, ఫిబ్రవరి, 2022 డిసెంబర్ నెలల్లో 33 కెవి సబ్ స్టేషన్ పరిధిలో 506 బ్రేక్ డౌన్స్ కాగా.. ఈ సారి గత మూడు నెలల్లో కేవలం 313 బ్రేక్ డౌన్ లు మాత్రమే నమోదయ్యాయి. అంటే గతంతో పోలిస్తే బ్రేక్ డౌన్స్38 శాతం మేరకు తగ్గాయి. అలాగే 33 కేవీ ట్రిప్పింగ్స్14 శాతం తగ్గింది. ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్స్ సైతం 25 శాతం తక్కువగా జరిగాయి. అంతేకాకుండా పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఫెల్యూర్‌లు కూడా 23 శాతం తగ్గినట్లు ఎన్‌పీడీసీఎల్ గణాంకాలు చెప్తున్నాయి.
మెయింటెనెన్స్ తోనే సాధ్యమైంది..
రెండు డిస్కంల పరిధిలో లైన్ ల నిర్వహణ, జంపర్లను సరిచేయడం, వంగిన కరెంటు పోల్‌లను సరి చేయడం, ఫీడర్ లపై కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేయడం, ఫీడర్లలో పవర్ ఫ్యాక్టర్ ల నిర్వహణ ఫలితంగా విద్యుత్ పంపిణీలో సమస్యలు తగ్గినట్టు చెప్తున్నారు. లో వోల్టేజీ సమస్యలు రాకుండా మెయింటెనెన్స్ చేయడం ద్వారానే అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించడం సాధ్యమైనదని అంటున్నారు.