- రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ నిర్ణయం
- మీటింగ్లో పాల్గొన్న ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, రాచమల్ల సిద్ధేశ్వర్
న్యూఢిల్లీ, వెలుగు: గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గ్రామ స్వరాజ్యంపై మరింతగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గ్రామాల్లో క్షేత్రస్థాయి వరకు వెళ్లేందుకు పంచాయతీరాజ్ సంఘటన్ కీలక భేటీ నిర్వహించింది. ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ నేషనల్ ఎగ్జిక్యూటీవ్ కార్యవర్గ సమావేశాలు రెండ్రోజుల పాటు నిర్వహించారు.
సంఘటన్ జాతీయ అధ్యక్షుడు సునీల్ పన్వర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, శశికాంత్ సెంథిల్, డీఎం సందీప్, తెలంగాణ సంఘటన్ అధ్యక్షుడు రాచమల్ల సిద్ధేశ్వర్‌లు హాజరయ్యారు. అలాగే దేశవ్యాప్తంగా సంఘటన్ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమయ్యే అంశాలపై చర్చించారు.
అనంతరం సిద్ధేశ్వర్ మీడియాతో మాట్లాడారు. దేశం ప్రజాస్వామ్య పాలనను కలిగి ఉండాలనే లక్ష్యంతో రాజీవ్ గాంధీ 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలను తెచ్చారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక సంస్థలకు అధికారాన్ని బదిలీ చేయడం ద్వారా దేశంలో అధికార వికేంద్రీకరణలో ఈ సవరణలు కీలక పాత్ర పోషించాయన్నారు.
