- జరిమానా విధించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టం నిబంధనలకు విరుద్ధంగా 2023లో ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ దాఖలైన పిల్‌లో సర్కారు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ధార్మిక, హిందూ మత సంస్థలకు సంబంధించిన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో నంబర్ 45ని జారీ చేసిందని కొండాపూర్‌కు చెందిన సంతోశ్ కుమార్ ఇతరులు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
అప్పటికే ఇదే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గత 20 ఏండ్లుగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని ధర్మాసనం బుధవారం తీవ్రంగా పరిగణించింది. గత అక్టోబర్‌లో విచారణ జరిగినప్పుడే కౌంటర్ దాఖలుకు చిట్టచివరి అవకాశమని చెప్పినప్పటికీ మళ్లీ వాయిదా కోరడం ఏమిటని సర్కారును ప్రశ్నించింది. ప్రతి పిటిషన్‌కు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
