ఇదేం వంటకం రా నాయినా... అక్కడ కూరల్లో మసాలాకు బదులు మట్టి వేస్తారట

ఇదేం వంటకం రా నాయినా... అక్కడ కూరల్లో మసాలాకు బదులు మట్టి వేస్తారట

ప్రస్తుత రోజుల్లో మసాలే లేనిదే ముద్ద దిగని వారు లోకంలో చాలా మంది ఉన్నారు. వెల్లుల్లి.. అల్లం... దాల్చిన చెక్క.. మసాలా దినుసులను దట్టంగా కూరకు పట్టిస్తే.. నా సామిరంగా ఆ రుచే వేరు..ఇక ఆ వీధిలోని వారందరూ పిన్ని... అత్త అని వరుసలు కలుపుతూ.. భోజనం వేళకు ఆ ఇంటికి వాలిపోతారు.  కాని ఓ దీవిలో నివసించే ప్రజలు మసాలా దినుసులకు బదులు మట్టితో కూరలు చేస్తారట.. ఏమిటి మట్టితో కూరలు అని అనుకుంటున్నా.. ఇది నిజమండి.. అది కాస్త పర్యాటక ప్రదేశం కావడంతో టూరిస్టులు కూడా ఆ వంటకాలను లొట్టలేసుకుకొని లాగించేస్తారట.. కూరల్లో మట్టి విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. . . .

ఇండియన్ వంటకాల్లో మసాలకు ఉన్న స్థానం ప్రత్యేకం. నాన్ వెజ్ వంటలకు ఘాటైన మసాలా వేస్తే వాసన వీధి చివర వరకూ వెళ్లాల్సిందే. ఒక్క నాన్ వెజ్ ఏంటి.. వెజ్ కర్రీస్ లో కూడా మసాలాలు వేస్తే ఆ రుచే వేరు. చాలామంది మసాలు లేకుండా ఏ వంట వండరేమో కదా..వివిధ దేశాల ప్రజలు వారి వారి రుచికితగ్గట్లు మసాలను తమ వంటకాల్లో దట్టిస్తుంటారు. కాని ఓ దీవి ప్రజలు కూరల్లో మసాలాకు బదులు మట్టి వేసి వండుతారట.  

ఆ దీవిలో ఆహార కొరత లేదు. ఏవి తినాలన్నా లభిస్తాయి. కానీ అక్కడి ప్రజలు మట్టిని తింటారు. అంటే... భోజనం బదులు మట్టిని తింటారని కాదు... వారు వండే వంటల్లో పోపులు, సుగంధ ద్రవ్యాల బదులు మట్టిని వాడుతారు. అదే వారికి ఎంతో టేస్టీగా ఉంటుంది. నిజానికి అది తినదగ్గ మట్టే. ఎందుకంటే... ఆ దీవిలో ఓ రంగుల పర్వతం ఉంది. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. పర్వతాన్ని మొత్తం తినవచ్చు. ప్రపంచంలో తినదగ్గ పర్వతం అది ఒక్కటే. అదాని అసలు పేరు హోర్మజ్ దీవి (Hormuz Island). ఇరాన్‌ పక్కన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో... సముద్రంలో ఉంటుంది. ఇరాన్ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది.


ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ ఐలాండ్‌లోని పర్వతాలు వివిధ వర్ణాల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రెయిన్‌బో ఐలాండ్‌ అని కూడా అంటారు.. ఇక్కడి ఒక్కో రంగు పర్వతం ఒక్కో రుచిగల మట్టిని కలిగి ఉంటుందట. దీంతో స్థానిక ప్రజలు ఈ పర్వతాల మట్టిని మసాలా దినుసులు కలిపినట్టు కలిపేసి.. వంటల్లో వేస్తారు.. ఇక్కడి మట్టిలో ఐరన్‌తోపాటు 70 రకాల ఖనిజాలున్నాయట. దీంతో ఈ మట్టి మసాలాలు రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని స్థానికులు అంటున్నారు.


ఈ ఐలాండ్‌లోని పర్వతాల్లో ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని, అవే కాలక్రమంలో మట్టిలో కలిసిపోయాయని భౌగోళిక శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, మట్టికి రుచి ఉండటం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఇక్కడి ప్రజలు ఆ రుచిని గుర్తించి వంటల్లో ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఈ రంగురంగుల పర్వతాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యటకులు వస్తారు. వారు కూడా హర్ముజ్‌ ఐలాండ్‌ ప్రత్యేక వంటలను రుచి చూసి ఫిదా అవుతుంటారు. 

ఆ దీవికి పర్యాటకులు వెళ్తే రకరకాల వంటలు టేస్ట్ చూడవచ్చు. కచ్చితంగా అవి ప్రత్యేక రుచితోనే ఉంటాయి. ఎందుకంటే... ఆ తినదగ్గ పర్వత మట్టి (edible soil) ప్రత్యేకత అది. మనం వంటల్లో సుగంధ ద్రవ్యాల్ని ఎలా చేర్చుతామో... వాళ్లు అలా... రకరకాల రంగుల మట్టిని వంటల్లో వేస్తారు. సువాసన, అదిరిపోయే రుచి వస్తుంది. ఆ రంగుల మట్టిలో కొన్ని రంగులు పుల్లగా ఉంటాయి... కొన్ని తియ్యగా ఉంటాయి. టూరిస్టులు వెళ్లినప్పుడు తాజా చేపల్ని పట్టి... వాటిని వండి... ఆ మట్టిని వేసి... సెర్వ్ చేస్తారు. అది పర్యాటకులకు బాగా నచ్చుతుంది. వాళ్లు తయారుచేసే ఓ రకమైన సాస్‌ని రెండు రోజులు ఎండలో ఉంచుతారు. తర్వాత దానితో సురాగ్ (Suragh) భోజనం వండుతారు. అది చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇరాన్‌తోపాటూ... విదేశీ పర్యాటకులకు అది ఎంతో ఇష్టం.

ఆ పర్వతం విచిత్రంగా  కనిపిస్తుంది.  ఆ పర్వతంలో తెలుగు, ఎరుపు, గ్రీన్, బ్రౌన్, ఎల్లో, బీజ్, గోల్డ్ ఇలా చాలా రంగులుంటాయి. అది ఓకే గానీ మట్టిని తింటే ఏమీ కాదా అనే డౌట్ మనకు ఉండొచ్చు. భౌగోళికంగా చూస్తే... నిజానికి అది మట్టి కాదు. అవన్నీ రకరకాల ఖనిజాలు. అందులో ఉప్పు కూడా ఉంటుంది. అందువల్లే అవి కలిపిన ఆహారం ఆరోగ్యకరమైనదిగా తేల్చారు. 60 కోట్ల సంవత్సరాల కిందట... ఈ దీవి పూర్తిగా సముద్రంలో ఉండేది. 50వేల సంవత్సరాల కిందట భూకంపాల వల్ల ఇది సముద్రం నుంచి పైకి లేచింది.  అక్కడి సముద్ర తీరాలు కూడా కాలుష్యం లేకుండా చూడచక్కగా ఉంటాయి. అక్కడికి వెళ్లిన వాళ్లు తమతో అక్కడి మట్టిని కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఇందుకోసం బాటిళ్లలో మట్టిని అమ్ముతారు.కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారే... అందుకు ఈ దీవే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రంగుల పర్వతం క్రమక్రమంగా తరిగిపోతోంది. అందువల్ల ఈ దీవి ప్రత్యేకతను కాపాడేందుకు ఇరాన్ పర్యావరణ డిపార్ట్‌మెంట్ ప్రయత్నిస్తోంది. భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రత్యేకతను పంచేలా చర్యలు తీసుకుంటోంది.