- తాము అనుమతులిచ్చాకే డీపీఆర్ తయారు చెయ్యాలని ఏపీకి చెప్పినం
- ఎన్ని ఎకరాలు.. ఎన్ని నీళ్లు కావాలో ఏపీ క్లారిటీ ఇయ్యలే
- ఏపీ సమర్పించిన నీటి లభ్యత వివరాలూ ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మించతలపెట్టిన పోలవరం– బనకచర్ల (ప్రస్తుత పోలవరం –నల్లమలసాగర్) ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులుగానీ, సూత్రప్రాయ ఆమోదంగానీ తెలుపలేదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ డిటెయిల్డ్ రిపోర్టు (డీపీఆర్) తయారీకి ఏపీ అక్టోబర్ 6న టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని, సర్వే, డీపీఆర్‌లు సహా ఏ పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కోరుతూ సీడబ్ల్యూసీ చైర్మన్‌కు అక్టోబర్ 10న తెలంగాణ ఈఎన్‌సీ జనరల్ లేఖ రాశారు. దానికి తాజాగా సీడబ్ల్యూసీ చైర్మన్ రిప్లై ఇచ్చారు.
పీబీ లింక్ పీఎఫ్ఆర్‌కు ఇంకా ఆమోదం తెలపలేదని వెల్లడిస్తూ ఈఎన్‌సీకి బదులిచ్చారు. ‘‘రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది మే 22న ప్రాజెక్ట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్ఆర్)ను సమర్పించింది.
పీఎఫ్ఆర్‌పై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), సభ్య రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌కు పీఎఫ్ఆర్‌ను పంపించాం. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకతోపాటు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, పీపీఏ అభిప్రాయాలు వెల్లడించాయి. డీపీఆర్తయారీకి ఇప్పటివరకూ ఏపీకి మేం ఎలాంటి సూత్రప్రాయ అనుమతులనూ ఇవ్వలేదు.
ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్‌ను ప్రస్తుతానికి సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నది. మానుంచి అనుమతులు వచ్చాకే నిబంధనలకు తగ్గట్టుగా డీపీఆర్‌ను తయారు చేయాలని ఏపీకి స్క్రీనింగ్ కమిటీ స్పష్టంగా చెప్పింది’’ అని తెలంగాణకు రాసిన లేఖలో సీడబ్ల్యూసీ వెల్లడించింది.
అవి ఇంకా పరిశీలనలోనే..
ప్రాజెక్ట్‌కు సంబంధించి జూన్ 5నే.. అంతర్రాష్ట్ర జల వివాదాల అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని, అందుకు తగ్గట్టుగా కంప్లయన్స్ రిపోర్టు ఇవ్వాలని ఏపీకి సూచించినట్టు సీడబ్ల్యూసీ వెల్లడించింది. జులై 14న ఏపీ రిప్లై ఇచ్చినా.. ఇంటర్ స్టేట్ మ్యాటర్స్‌ను ఏపీకి గుర్తు చేస్తూ జులై 31న లేఖ రాసినట్టు గుర్తు చేసింది. ‘‘ప్రాజెక్ట్‌కు సంబంధించి హైడ్రాలజీ (నీటి లభ్యత వివరాలు) అంశాలపై జూన్ 30నే ఏపీకి లేఖ రాశాం.
జులై 14న ఏపీ ఆ వివరాలను సమర్పించింది. లెక్కల్లో గందరగోళం ఉండడంతో రివైజ్డ్ హైడ్రాలజీ లెక్కలను సమర్పించాల్సిందిగా ఆగస్టు 4న లెటర్ రాశాం. అక్టోబర్16న ఏపీ హైడ్రాలజీ లెక్కలను పంపింది. వాటిని మేం పరిశీలిస్తున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాటికి కంప్లయన్స్ రిపోర్టులను పంపాలని చెప్పగా.. అక్టోబర్ 27న ఏపీ పంపించింది. అది కూడా ఇంకా పరిశీలన దశలోనే ఉంది’’ అని సీడబ్ల్యూసీ వెల్లడించింది.
ఏపీ ఆ వివరాలు ఇయ్యలే..
ప్రాజెక్ట్ ద్వారా ఏపీ సృష్టించాలనుకున్న కొత్త ఆయకట్టు, స్థిరీకరణకు ఎన్ని నీళ్లు అవసరమవుతాయన్న విషయంపైనా కంప్లయన్స్ రిపోర్టును ఇవ్వాల్సిందిగా జులై 3న ఏపీకి లేఖ రాసినట్టు సీడబ్ల్యూసీ పేర్కొన్నది. జులై 14న రాసిన లేఖలోనే ఆ విషయాలను ఏపీ పొందుపరిచినా.. స్పష్టత లోపించిందని తెలిపింది. ఏపీ అధికారులతో సమావేశాలు నిర్వహించి మరోసారి స్పష్టమైన లెక్కలు చెప్పాలని, ఎన్ని నీళ్లు అవసరమవుతాయో వివరించాలని చెప్పామని పేర్కొన్నది. అయితే, ఏపీ నుంచి ఇప్పటివరకూ ఆ వివరాలేవీ తమకు అందలేదని సీడబ్ల్యూసీ వెల్లడించింది.
మరోవైపు కో బేసిన్స్టేట్స్ అయిన ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ నుంచి పీఎఫ్ఆర్‌పై అభిప్రాయాలు రాలేదని, ఆయా రాష్ట్రాల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, ఏపీ బనకచర్ల లింక్ డీపీఆర్‌కు పిలిచిన టెండర్లను వాపస్ తీసుకొని.. కొత్తగా నల్లమలసాగర్ లింక్‌ను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పోలవరం –నల్లమలసాగర్ లింక్ డీపీఆర్‌కు ఇటీవలే టెండర్లనూ పిలిచింది.
