
లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఓటమి కారణాలను విశ్లేషించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. ఓటమికి వందశాతం తానే బాధ్యత వహిస్తానని రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలిసింది. చర్చ సమయంలో రాహుల్ రాజీనామా ప్రతిపాదనను CWC నేతల ముందు ఉంచినట్లు తెలిసింది. అయితే రాజీనామా పరిష్కారం కాదని, కమిటీ సభ్యులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే యూపీ, ఒడిశా పీసీసీ చీఫ్ లతో పాటు కర్ణాటక కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ HK పాటిల్ రాజీనామాలకు సిద్ధపడ్డారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్, గెహ్లాట్, గులాంనబీ ఆజాద్, ఖర్గే, అమరీందర్ సింగ్, మోతీలాల్ వోరా, చిదంబరం, సిద్ధరామయ్య తదితర సభ్యులంతా హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా 115 చోట్ల రాహుల్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 17 శాతం గెలుపు దక్కగా, 83 శాతం పరాజయాలు ఎదురయ్యాయి. ఇలాంటి కష్ట సమయంలో రాహుల్ తప్పుకుంటే.. ఆ స్థాయిలో వాయిస్ వినిపించే పరిస్థితి ఉండదని, రాహులే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ సీడబ్ల్యూసీ నేతలు కోరినట్లు తెలిసింది.
2014 ఎన్నికల్లో 44 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి 52 సీట్లతో సరిపెట్టుకుంది. కీలకమైన యూపీలో సోనియాగాంధీ బరిలో ఉన్న రాయ్ బరేలీ సీటు మాత్రమే గెలిచారు. సిట్టింగ్ సీటైన అమేథీలో రాహుల్ కు ఓటమి తప్పలేదు. ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రచారం చేయించినా లాభం లేకుండా పోయింది. అటు చౌకీదార్ చోర్ అంటూ పదేపదే రాహుల్ చేసిన ప్రచారం బెడిసికొట్టిందన్న విశ్లేషణలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి.