హైదరాబాద్, వెలుగు: మొన్నటిదాకా సామాన్యులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు పోలీసు ఆఫీసర్లపై పడ్డారు. చివరికి రాష్ట్ర డీజీపీని కూడా వదల్లేదు. డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. 97857 43029 ఫోన్ నంబర్‌కి డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటో డీపీగా పెట్టి.. పోలీసులు, ప్రజలకు వాట్సాప్ మెసేజ్‌లు, లింక్స్ పంపిస్తున్నారు. పలువురు ప్రముఖులకు, ఐపీఎస్ అధికారులకు మెసేజ్‌లు రావడంతో పోలీసు శాఖ వెంటనే అలర్ట్ అయ్యింది. డీజీపీ డీపీతో ఉన్న ఫోన్ నంబర్‌ను సోమవారం ఉదయం బ్లాక్ చేసింది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సూమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది నైజీరియన్స్ పనేనని ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
పోలీసులనే టార్గెట్ చేస్తున్నరు
పోలీసులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఫేక్ సిమ్ కార్డులు, ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్స్‌తో మోసాలు చేస్తున్నారు. గతేడాది అడిషనల్ డీజీ స్వాతి లక్రా, అప్పటి నల్గొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్ సహా రాష్ట్రవ్యాప్తంగా 60 మందికి పైగా పోలీసు ఆఫీసర్ల ఫొటోలతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌లోని కాంటాక్స్ట్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. ఇలా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారికి ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్‌లో మెసేజ్‌లు చేశారు. అధికారి హోదాను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేశారు. వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్స్ పేరుతో కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఉన్నతాధికారుల డీపీ ఉండడంతో సైబర్ నేరగాళ్లు ఇచ్చిన గూగుల్ పే అకౌంట్స్‌కు అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇలాంటి కేసుల్లో ఎవరైనా చెబితే తప్ప ఫేక్ అకౌంట్స్ గుర్తించలేకపోవడం గమనార్హం.
గతేడాది 28 మంది అరెస్టు.. అయినా ఆగలే..
పోలీసులకు సవాల్‌గా మారిన ఫేక్ డీపీలపై సైబర్ ఎక్స్‌పర్ట్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఫోన్ నంబర్స్, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా రాజస్థాన్, యూపీ, ఒడిశాకు చెందిన 28 మందిని గతేడాది అరెస్ట్ చేశారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల నుంచి సవాళ్లు తప్పట్లేదు. ఏకంగా డీజీపీ పేరుతో అకౌంట్ క్రియేట్ చేయడంతో సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజలను అలర్ట్ చేస్తూనే సైబర్ నేరగాళ్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తమ పేరుతో క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్లను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. తమ అకౌంట్లలో యూనిఫాంతో, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఉన్న ఫొటోలకు ప్రైవసీ సెట్టింగ్స్ చేస్తున్నారు. ఫొటో డీపీలతో వచ్చే పోస్టింగ్స్‌ను యాక్సెప్ట్ చెయ్యొద్దని తమ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ట్యాగ్ చేస్తున్నారు.
వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నరు
డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను డీపీగా పెట్టి మోసం చేస్తున్నారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్లు ఫోన్ నంబర్ చూసి ఫేక్ అని గుర్తించారు. గతంలో ఐ అండ్ పీఆర్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేరుతో ఫేక్ డీపీలు క్రియేట్ చేశారు. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’
- గజరావు భూపాల్, సీసీఎస్, డీసీపీ
