- ఇన్వెస్ట్‌మెంట్ మోసాల్లో రూ.29.88 కోట్లు దోపిడీ
- డాక్టర్ల అసోసియేషన్లతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో సమావేశం
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలోని డాక్టర్లను లక్ష్యంగా చేసుకున్నారని, 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 735 మంది నుంచి రూ.29.88 కోట్లు కాజేశారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. విద్యావంతులు, ఉన్నత వృత్తుల్లో కొనసాగుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు సైబర్ మోసాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పలువురు వైద్య రంగ ప్రతినిధులతో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శిఖాగోయల్ మాట్లాడుతూ చాలామంది డాక్టర్లు బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్ సంబంధిత మోసాలకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి ఆర్థిక మోసాల్లో మొదటి గంట అత్యంత కీలకమని పేర్కొన్నారు. మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్ లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేసి తిరిగి డబ్బు పొందే అవకాశం పెరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ‘సైబర్ అవగాహన– నివారణ – రక్షణ’ అనే ఉమ్మడి నినాదంతో టీజీసీఎస్‌బీ, వైద్య సంఘాలు కలిసి పనిచేయాలని తీర్మానించారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, క్లినిక్ నిర్వాహకులకు సైబర్ సెక్యురిటీపై అవగాహన కల్పించేందుకు మెడికల్ సెమినార్లు, వైద్య విద్యా కార్యక్రమాల ద్వారా ప్రత్యేక ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో టీజీ సీఎస్‌బీ అడ్మిన్ ఎస్పీ హర్షవర్ధన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎంపీ కిషన్ సహా పలు డాక్టర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.
