ఇన్వెస్ట్​మెంట్, గిఫ్ట్​ల పేరుతో మోసం

ఇన్వెస్ట్​మెంట్, గిఫ్ట్​ల పేరుతో మోసం
  • ముగ్గురి నుంచి రూ.కోటి కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

బషీర్​బాగ్, వెలుగు: ఇన్వెస్ట్​మెంట్, గిఫ్ట్​ల పేరుతో సిటీకి చెందిన ముగ్గురి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. కోటి 7 లక్షలు కొట్టేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ వ్యక్తికి ఇన్​స్టాగ్రామ్​లో కొందరు పరిచయమయ్యారు. తాము పంపించే యూట్యూబ్ లింక్స్​ను ఓపెన్ చేసి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తే పైసలిస్తమని నమ్మించారు. మొదట కొంత మొత్తాన్ని బాధితుడికి చెల్లించారు. ఆ తర్వాత తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. 

వారి మాటలు నమ్మిన బాధితుడు పలు దఫాలుగా సుమారు 53 లక్షలను ఇన్వెస్ట్ చేశాడు. అప్పటి నుంచి సదరు వ్యక్తులు స్పందించికపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.   కారు గిఫ్ట్​గా వచ్చిందని ట్యాక్స్​లు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ఓ వ్యక్తి రూ.36 లక్షలు, బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో మరో వ్యక్తి నుంచి రూ.18 లక్షలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.  బాధితుల కంప్లయింట్​తో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.