బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. సీవీ ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. సీవీ ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్

సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సోషల్ల మీడియా ప్లాట్ ఫామ్స్..ట్విట్టర్, వాట్సప్,ఫేస్ బుక్ లలో ఫేక్ అకౌంట్లతో లింకులు పెట్టి సామాన్య జనం నుంచి  దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఎమర్జెన్సీ అంటూ మెసేజ్ లు పెట్టి డబ్బులు కాజేస్తున్నారు. లేటెస్ట్ గా కొంత మంది తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.  ఈ విషయం తెలిసిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీవీ ఆనంద్  పేరుతో ఫేస్ బుక్ , ఇన్స్టాగ్రామ్ లలో అగంతకులు ఫేక్ అకౌంట్ లు ఓపెన్ చేసినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆయా అకౌంట్ ల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను పంపించినట్లు వారు గుర్తించారు. అంతేగాకుండా అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టినట్లు గుర్తించారు.  తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సీవీ ఆనంద్ దృష్టికి ఈ ఫేక్ అకౌంట్ ద్వారా ఆయన పేరుతో పలువురికి మెసేజ్ లు పంపించారని తెలియడంతో , ఏసీబీ అధికారులు వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపారు.