ఇరాక్ లో సైబర్ మోసానికి జగిత్యాల యువకుడు బలయ్యాడు. యూట్యూబర్ హర్ష సాయి పేరుతో యువకుడి నుంచి రూ. 87 వేలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టలపల్లి గ్రామానికి చెందిన రాకేష్ జీవనోపాధి కోసం ఇరాక్ వెళ్ళాడు. పదిరోజుల కోసం ఇరాక్ వెళ్లిన రాకేష్ ఫేస్ బుక్ లో ఒక పోస్టును లైక్ చేశాడు. ఆ తర్వాత యూట్యూబర్ హర్ష సాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ ద్వారా రాకేష్ తో పరిచయం పెంచుకున్నారు ముఠా సభ్యులు. నమ్మించేందుకు హర్ష సాయి పేరుతో ఉన్న ఆధార్ కార్డు కాపీని పంపించారు ముఠా.
అప్పులు తీర్చడానికి ఐదు లక్షలు సహాయం చేస్తాం అని చెప్పి నమ్మించారు ముఠా సభ్యులు. తరువాత ఫోన్‌పే ద్వారా 6లక్షల 50వేలు పంపినట్టు నకిలీ స్క్రీన్‌షాట్లు పంపి మోసం చేశారు కేటుగాళ్లు. డబ్బులు అందకపోవడంతో రాకేష్ ప్రశ్నించగా ఫండ్ విడుదల కావాలంటే టాక్స్ చెల్లించాలని నమ్మించారు మోసగాళ్లు. గుడ్డిగా నమ్మిన రాకేష్ ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యుల ఖాతాల నుండి విడతల వారీగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మొత్తం 87 వేలు పంపించాడు.
ఆ తర్వాత ఇంకా డబ్బులు డిమాండ్ చేసిన కేటుగాళ్లు చెల్లించకపోతే డిజిటల్ అరెస్ట్ చేస్తామని.. కఠిన శిక్ష పడుతుందని బెదిరించారు సైబర్ ముఠా.డిజిటల్ అరెస్ట్ కు సంబంధించిన కొన్ని ఫేక్ వీడియోలు రాకేష్ కు పంపించి బెదిరించారు సైబర్ ముఠా. ఆ వీడియోలు చూసి భయపడిపోయాడు రాకేష్. మోసపోయానని గుర్తించిన రాకేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
