సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాల్సిన పోలీసే అడ్డంగా లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బత్తుల మహేందర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డాడు.
ఒక సైబర్ మోసం కేసులో బాధితుడి కుటుంబ సభ్యులను ఇరికించకుండా ఉండాలంటే... ఏకంగా 9 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ మహేందర్ డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా బాధితుడి నుంచి ఇప్పటికే ఐదు లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా వసూలు చేశాడు. మిగిలిన 4 లక్షల రూపాయల కోసం బాధితుడిని మరోసారి బెదిరింపులకు గురిచేశాడు. దీనితో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం...మే 30న ఇన్‌స్పెక్టర్ మహేందర్ మిగిలిన 4 లక్షల రూపాయల లంచం డబ్బును తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
►ALSO READ | నాగోల్ లో చిప్స్, స్నాక్స్ కొంటున్నారా.? జాగ్రత్త.. పాడైన ఆయిల్ నే మళ్లీమళ్లీ వాడుతున్నరు
ఇన్‌స్పెక్టర్ అరెస్ట్ అనంతరం అతడి అధికారిక నివాసంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని 13 లక్షల రూపాయల భారీ నగదుతో పాటు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, కీలకమైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ మహేందర్ వెనకాల ఉన్న అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు మరింత లోతైన విచారణను కొనసాగిస్తున్నారు. లంచం కేసులో అరెస్టయిన నిందితుడిని అధికారులు నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
