నాగోల్ లో చిప్స్, స్నాక్స్ కొంటున్నారా.? జాగ్రత్త.. పాడైన ఆయిల్ నే మళ్లీమళ్లీ వాడుతున్నరు

నాగోల్ లో చిప్స్, స్నాక్స్ కొంటున్నారా.?  జాగ్రత్త.. పాడైన ఆయిల్ నే మళ్లీమళ్లీ వాడుతున్నరు

 గ్రేటర్ హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి కొరడా ఝులిపించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నాగోల్‌లోని  బాలాజీ పేని అండ్ నమ్కీన్ యూనిట్‌లో ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సంస్థ భారీగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.

కనీస పరిశుభ్రత లేకుండా, పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్, ఫుడ్ స్టోర్ ఏరియాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతటితో ఆగకుండా... ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ, ఒకసారి వాడి పాడైపోయిన వంట నూనెను  తిరిగి  వాడుతున్నట్లు తనిఖీల్లో తేలింది.

దీనిపై తక్షణమే స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు... నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 150 కిలోల వంట నూనె, 720 కిలోల సేవ్, అలాగే 120 కిలోల ఆలూ చిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 990 కిలోల కల్తీ, అపరిశుభ్ర ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.అసలు ఎలాంటి ఫుడ్ లైసెన్స్ లేకుండానే ఈ నమ్కీన్ యూనిట్‌ను నడుపుతున్నట్లు గుర్తించిన అధికారులు... యాజమాన్యానికి కఠిన నోటీసులు జారీ చేశారు. 

 మార్కెట్‌లో ఆహార పదార్థాలు కొనేటప్పుడు కేవలం లైసెన్స్ ఉన్న సంస్థల నుంచే నమకీన్, స్నాక్స్ వంటివి కొనుగోలు చేయాలని  ఈ సందర్భంగా వినియోగదారులకు అధికారులు  సూచించారు. కొనే ముందు ఆహార పదార్థాల నాణ్యత, ప్యాకేజింగ్,  ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేదీలను) తప్పనిసరిగా పరిశీలించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.