జేఎన్టీయూ, వెలుగు: ప్రస్తుతం అంతర్జాతీయంగా సైబర్ దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి సైబర్‌సెక్యూరిటీ ఎంతో అవసరమని జేఎన్టీయూ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. జేఎన్టీయూహెచ్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థ రెండు రోజుల ‘ వల్నరబిలిటీ అస్సెస్ మెంట్ అండ్ పెనెట్రేషన్ టెస్టింగ్’ ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం జేఎన్టీయూహెచ్ లో శుక్రవారం ప్రారంభమైంది.
ఇందులో పాల్గొన్న వీసీ మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ చాలా ముఖ్యమైన అంశాలని.. వీటిని మానవ శ్రేయస్సుకు, వినాశనానికి రెండు విధాలుగా వాడొచ్చన్నారు. నోబెల్ శాస్త్రవేత్త డైనమైట్ ని మానవ శ్రేయస్సు కోసం కనిపెడితే, అది చెడ్డ వారి చేతిలో వినాశనాన్ని సృష్టించిందన్నారు. సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని జేఎన్టీయూ గుర్తించి, సైబర్ సెక్యూరిటీ కోర్స్ ని ప్రారంభించిందన్నారు. యూఎస్ఏ పర్యటనలో వివిధ వర్సిటీలతో జేఎన్టీయూహెచ్ ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దేవి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, రెక్టార్ గోవర్ధన్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
