ఆరోగ్యశ్రీలో డబ్బులు వచ్చాయంటూ.. అకౌంట్ ఖాళీ చేసిన కేటుగాడు

ఆరోగ్యశ్రీలో డబ్బులు వచ్చాయంటూ.. అకౌంట్ ఖాళీ చేసిన కేటుగాడు
  •  అకౌంట్ ఖాళీ చేసిన సైబర్  కేటుగాడు

గండీడ్, వెలుగు : సైబర్  నేరగాడి ఉచ్చులో చిక్కిన  ఓ వ్యక్తి నిండా మునిగిపోయాడు. మహబూబ్ నగర్  జిల్లా మహమ్మదాబాద్  మండలంలో ఇది జరిగింది.  ఎస్ ఐ సురేశ్  తెలిపిన ప్రకారం మహమ్మదాబాద్  మండలం నంచర్ల గేటుకు చెందిన మాలేల అంజిలయ్య రిటైర్డ్ టీచర్. ఆయనకు ఈనెల 5న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని, మీకు ఆరోగ్యశ్రీ పథకంలో రూ.45 వేలు వచ్చాయని చెప్పాడు. డబ్బులు ఫోన్ పేలో పంపిస్తామని నమ్మించాడు. అందుకోసం ఫోన్ పే ఓపెన్  చేసి ప్రాసెసింగ్  పూర్తి చేయాలని చెప్పాడు. దీంతో ఫోన్ పే యాప్  ఓపెన్  చేసిన అంజిలయ్య.. సైబర్  కేటుగాడు చెప్పినట్లు చేశాడు. తర్వాత ఆయన ఖాతా నుంచి రూ.73 వేలు ఖాళీ అయిపోయాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.