కొత్త సర్పంచులకు సవాల్.. రెండేండ్లుగా పంచాయతీలకు నిలిచిన నిధులు

కొత్త సర్పంచులకు సవాల్..  రెండేండ్లుగా పంచాయతీలకు నిలిచిన  నిధులు
  • ఎన్నికల్లో గ్రామంలోని సమస్యల పరిష్కారానికి అభ్యర్థుల హామీలు
  • జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో ఫస్ట్ టైం సర్పంచ్​లే
  • రేపు కొలువుదీరనున్న గ్రామ పాలకవర్గాలు

ఆదిలాబాద్, వెలుగు: పల్లె సంగ్రామం ముగిసింది. సోమవారం నుంచి కొత్త సర్పంచ్​ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియగా.. అప్పటి నుంచి పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు డిసెంబర్ 11 నుంచి 17 వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశారు. దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరనుండగా.. గ్రామల్లోని సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు కొత్త సర్పంచ్​లకు సవాల్​గా మారనుండగా వాటిని ఎలా పరిష్కరిస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది.

70 శాతానికిపైగా ఫస్ట్ టైమ్ సర్పంచ్​లే..

ఆదిలాబాద్ ​జిల్లాలో ఈసారి గెలుపొందిన సర్పంచుల్లో 70 శాతానికిపైగా ఫస్ట్ టైమ్ గెలిచిన వారే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 473 గ్రామ పంచాయతీలకు గాను 385 మంది మొదటి సారి సర్పంచ్​గా గెలిచారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు.. పాలనలో అనుభవం లేని వారే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వీరు అనేక హామీలిచ్చారు. కాగా ఆ హామీలు నెరవేర్చడం వారికి ఒక సవాల్ గా మారనుంది.

 ప్రస్తుతం గ్రామాల్లో సమస్యలు పేరుకుపోవడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల విడుదల నిలిచిపోగా ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులే అరకొర పనులు చేశారు. కాగా పంచాయతీ కార్యదర్శులకు రావాల్సిన బిల్లులు ఇప్పటి వరకు రాక పెండింగ్​లో ఉన్నాయి. తాజాగా కొత్త సర్పంచ్​లు బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఇప్పుడైనా నిధులు విడుదలవుతాయని వారు ఆశతో ఉన్నారు. 

నిలిచిన నిధులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం, ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లోని జనాభా ప్రకారం విడుదల చేస్తుంది. పంచాయతీల్లో పాలకవర్గాలు ఉన్న సమయంలోనే ఈ నిధులు కేటాయిస్తారు. కానీ రాష్ట్రంలో దాదాపు రెండేండ్ల నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో ఈ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి ఆత్యవసర పనులు చేయించుకున్నారు. 

నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామపంచాయతీ ట్రాక్టర్ కిస్తీలు, కరెంట్ బిల్లులు సైతం పెను భారంగా మారాయి. డీజిల్ కు సైతం డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. ఇలా ఎన్నో సమస్యలతో పంచాయతీలు సతమతమపుతున్నాయి. ఈ సమస్యలే కాకుండా ఎన్నికల ప్రచారంలో ఆలయాలు, కమ్యూనిటీ హాల్స్, రోడ్లు, మురికి కాలువలు నిర్మిస్తామని 
ప్రత్యేక హామీలు ఇచ్చారు.  

ఆగిపోయిన కొన్ని పనులు ఇవే..

ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండ గ్రామపంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయి.  దాదాపు రూ.10 లక్షలు వరకు నిధులు కావలిసి ఉండగా నిధులు విడుదల కాకపోవడంతో పనులు జరగలేదు.
బోథ్​లో సీసీ రోడ్డుకు మధ్యలో కల్వర్టు దెబ్బతినడంతో పెద్దగుంత ఏర్పడింది. అక్కడ కొత్త కల్వర్టు నిర్మించాలంటే దాదాపు రూ.30 వేలు నిధులు కావాల్సి ఉంది. గ్రామ పంచాయతీలో నిధుల కొరతతో ఇక్కడ నిర్మాణం పనులు ఆగిపోయాయి.

ఇంద్రవెల్లి మండలంలోని హర్కపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మచ్చాపూర్ లో మురికి కాలువలు  నిర్మించేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు నిధులు కావాల్సి ఉండగా.. గ్రామ పంచాయతీలో నిధుల కొరతతో నిర్మాణ పనులు జరగలేదు.