మున్సిపోల్స్ ప్రచారానికి బడా నేతలు..రానున్న ఐదు రోజులు ప్రధాన పార్టీల్లో జోష్

మున్సిపోల్స్ ప్రచారానికి బడా నేతలు..రానున్న ఐదు రోజులు ప్రధాన పార్టీల్లో జోష్
  • 6న సీఎం రేవంత్​రెడ్డి, 8న ఏపీ డిప్యూటీ సీఎం పవన్​కళ్యాణ్ రాక
  • మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్​తో పాటు మహారాష్ట్ర నేతలు రాక

నిజామాబాద్​, వెలుగు:  రానున్న ఐదు రోజులు  నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. బడా నేతలు వస్తుండడంతో ప్రధాన పార్టీల్లో ప్రచార హీట్ పెరిగింది. నామినేషన్ల విత్​డ్రా ప్రక్రియ పూర్తై అభ్యర్థులకు గుర్తులను కేటాయించగా, వాటిని ప్రింట్ చేయించుకుని బుధవారం ఆలయాల్లో పూజలు చేసి, అభ్యర్థులు ప్రచారం షురూ చేశారు. ముఖ్య నేతల సభలు, పర్యటనలతో ప్రచారంలో మరింత జోష్ వచ్చే  అవకాశం ఉంది.

సీఎం సభతో ప్రచారానికి షురూ..

ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. నగర శివారులోని బైపాస్ రోడ్ సమీపంలో సుమారు 50 వేల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికను ఆచితూచి చేపట్టి బరిలోకి దింపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీపీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి వ్యూహాలు సిద్ధం చేస్తుండగా, ఇన్‌‌‌‌చార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అదనంగా టీపీసీసీ అబ్జర్వర్లను కూడా పార్టీ నియమించింది. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు హోరాహోరీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సభ తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్‌‌‌‌తో కార్నర్ మీటింగ్స్..

నగర పాలక సంస్థలో బీజేపీ గెలుపును సవాల్‌‌‌‌గా తీసుకుని ఎంపీ అర్వింద్ పావులు కదుపుతున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ఇందూర్‌‌‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌‌‌తో నగరంలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రచార గడువు ముగిసే ముందు రోజు ఈ నెల 8న పవన్ కళ్యాణ్ రానున్నారు.

సినీ హీరో పవన్ కళ్యాణ్‌‌‌‌ క్రేజ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని భారీ సభకన్నా కార్నర్ మీటింగ్స్ ద్వారానే   ప్రయోజనం ఉంటుందని బీజేపీ నిర్ణయించింది. నగర పాలక సంస్థలోని 60 డివిజన్లలో 51 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ నుంచి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున ప్రచారానికి వస్తున్న పవన్ కళ్యాణ్ కార్యక్రమాల్లో జనసేన అభ్యర్థులు పాల్గొంటారా? లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఏం మాట్లాడుతారన్నది చర్చనీయాంశంగా మారింది.

మజ్లిస్, బీఆర్‌‌‌‌ఎస్ నేతల పర్యటనలు

నిజామాబాద్ కార్పొరేషన్‌‌‌‌లో 21 డివిజన్లలో పోటీ చేస్తున్న మజ్లిస్ ప్రచారానికి ఈ నెల 8న ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ రానున్నట్లు సమాచారం. ఆయనతో పాటు మహారాష్ట్రకు చెందిన ముఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భీంగల్ మున్సిపాలిటీలో కార్నర్ మీటింగ్ కోసం బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ను రప్పించేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. 15 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ సింబల్‌‌‌‌పై పోటీ చేస్తున్న అభ్యర్థులు జాగృతి అధ్యక్షురాలు కవితను  ప్రచారానికి రావాలని కోరినట్లు సమాచారం.