- ఉద్యోగానికైనా, పెండ్లికైనా, ఫారిన్ వెళ్లాలనుకున్నా కీలకంగా సోషల్ మీడియా బిహేవియర్
- ఒక్క చెడ్డ పోస్టుతో భవిష్యత్తుతలకిందులయ్యే ప్రమాదం
- ఉద్యోగాలు రాకపోవచ్చు..
- ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నయ్..
- పీటల దాకా వచ్చిన పెండ్లిళ్లు ఆగిపోతున్నయ్
- విదేశాలు వీసాలు రిజెక్ట్ చేస్తున్నయ్
- సోషల్ మీడియాను స్క్రీనింగ్ చేస్తున్న కంపెనీలు, వివిధ దేశాలు
- చెడు కంటెంట్ పెట్టకుండా బాధ్యతగా ఉండాలంటున్న టెక్ నిపుణులు
హైదరాబాద్, వెలుగు:ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్.. వేదిక ఏదైనా సోషల్ మీడియాలో యూత్ ట్రెండ్‌సెట్ చేస్తున్నది. ఒక్క యువతేనా.. మధ్య వయసు వాళ్లు కూడా దాంట్లో మునిగి తేలుతున్నారు. రీల్స్ చేస్తున్నారు.. పోస్టులు పెడుతున్నారు. వాటిలో మంచివీ ఉంటున్నయ్.. చెడ్డవీ ఉంటున్నయ్.
మంచివైతే ఫర్వాలేదు.. చెడు పోస్టులతోనే ఇబ్బందులు వచ్చిపడుతున్నయ్. ఒక్క బ్యాడ్ పోస్ట్ భవిష్యత్తునే తలకిందులు చేసేస్తున్నది. పెళ్లిళ్లు ఆగిపోవచ్చు.. రావాల్సిన ఉద్యోగమూ రాకపోవచ్చు.. అమెరికాకు వెళ్లాలన్న కలకు చెక్ పడొచ్చు.
అన్నం ఉడికిందా? లేదా? అని తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చాలని అంటుంటారు.. అలాగే, సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చెడ్డది పెట్టినా మన బిహేవియర్ మొత్తానికి మచ్చ పడిపోతుంది. అందుకే సోషల్‌మీడియాలోనూ సరైన బిహేవియర్ మెయింటెయిన్చేయాలని టెక్ఎక్స్పర్ట్స్చెబుతున్నారు. అడ్డమైన పోస్టులు పెట్టకుండా అక్కరకొచ్చే పోస్టులు పెడితే మన భవిష్యత్తుకు బెంగ లేకుండా ఉంటుందని సూచిస్తున్నారు.
పెళ్లిళ్లు ఆగిపోతున్నయ్..
ఇండోర్‌ను అందరూ క్లీన్ సిటీ అని పిలుస్తుంటారు. కానీ, ఆ సిటీలో జస్ట్ ఒక్క నెలలోనే 150కిపైగా పెండ్లిళ్లు సోషల్ మీడియా కారణంగా ఆగిపోయాయి. పెండ్లి కూతురో.. పెండ్లి కొడుకో గతంలో పెట్టిన పోస్టులను చూసి ‘నువ్వు నాకు వద్దు’ అని చెప్పేసుకుంటున్న ఘటనలు అక్కడ పెరుగుతున్నాయి.
అక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. అభ్యంతరకరమైన పోస్టులు కండ్ల ముంగట కనిపించే సరికి.. పెండ్లి చేసుకుని పచ్చగా జీవించాలని కలలుగన్న జంటలు ఆ బంధాలను తెంచేసుకుంటున్నాయి. వారి కుటుంబ సభ్యులు కూడా పెండ్లిళ్లు రద్దు చేసుకోవడమే బెటర్ అని తేల్చేస్తున్నారు.
అలాంటి వ్యక్తులను తమ ఇంటికి తెచ్చుకోవడమో.. లేదంటే వారి ఇంటికి పంపడం వల్ల పరువు, ప్రతిష్టలు మంటగలసిపోతాయని భావిస్తున్నారు. అందుకే ఖర్చు పోతే పోయినా.. అలాంటి వ్యక్తులు వద్దని వారు కరాఖండిగా చెప్పేస్తున్నారు. దీని వల్ల కొన్ని రోజులు బాధపడితే పడినా.. ఆ తర్వాత జీవితం బాగుంటుందని ఆలోచిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
ఉద్యోగాలు ఊడుతయ్..
చాలా కంపెనీలు ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే టైంలో సోషల్ మీడియా పోస్టులనూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఆటిట్యూడ్‌ను తెలుసుకునేందుకు వారు పెట్టే పోస్టులను ఫుల్స్కాన్చేస్తున్నాయి. అభ్యర్థి ప్రొఫెషనలిజం, కల్చరల్ యాక్టివిటీస్‌ను అంచనా వేస్తున్నాయి.
రెజ్యుమెలో పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఆ? కాదా? కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా నిర్ధారించుకుంటున్నారు. ఎలాంటి కంటెంట్ పెడుతున్నరు? దాని వల్ల లాభనష్టాలేంటి? లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ నెగెటివ్ కంటెంట్ ఏదైనా ఉంటే.. వాళ్ల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.
అలాంటి వ్యక్తుల వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందని సంస్థలు భావిస్తున్నాయి. పాజిటివ్ఆటిట్యూడ్ ఉన్న పోస్టులనూ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో దాదాపు 60 శాతం మంది అభ్యర్థుల దరఖాస్తులను రిక్రూటర్లు తిరస్కరించారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రెచ్చగొట్టే కంటెంట్ (ఫొటోలు, వీడియోలు, సమాచారం) పెట్టారని, పీకలదాకా తాగిన వీడియోలు పోస్ట్ చేయడం, డ్రగ్స్ తీసుకుంటున్న పోస్టులు పెట్టడం, కుల, మత, జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం, అంతకుముందు పనిచేసిన సంస్థపై చెడుగా ప్రచారం చేయడం, అర్హతలపై అబద్ధాలు చెప్పడంలాంటి పోస్టులను చూసి రిక్రూటర్లు దరఖాస్తులను తిరస్కరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
అంతేకాదు.. ఉద్యోగం చేస్తున్న సందర్భంలోనూ సోషల్ మీడియాలో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోవడమూ ఖాయం. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలూ తరచూ చోటు చేసుకుంటున్నాయి.
వీసా కావాలా?.. సోషల్ మీడియా చూపాలె
గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే.. విదేశాలకు ఎగిరిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ, ఆ కలలు ఒక్క సోషల్ మీడియా పోస్టుతో కల్లలైపోవచ్చు. సోషల్ మీడియా పోస్టులను చూసి అమెరికా ఒక్క ఏడాదిలోనే 85 వేల వీసాలను రిజెక్ట్ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇటీవలి కాలంలో అమెరికాలాంటి దేశాలు సోషల్ మీడియా చెక్స్‌కు సంబంధించిన రూల్స్‌ను మరింత కఠినతరం చేశాయి.
వీసాకు అప్లై చేసినప్పుడు కచ్చితంగా సోషల్ మీడియా అకౌంట్స్ యూజర్ నేమ్స్‌ను ఇవ్వాల్సిందేనని నిబంధనలు పెడ్తున్నాయి. యూజర్ నేమ్ ఇవ్వడమే కాదు.. దానిని ప్రైవసీ మోడ్ నుంచి ఆ ప్రొఫైల్ అందరికీ కనిపించేలా పబ్లిక్ స్టేటస్‌లో పెట్టాలి. ఇంటర్వ్యూకు ముందే అప్లికెంట్ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను ఇమిగ్రెంట్ అధికారులు చెక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా తేడాగా అనిపిస్తే ఇంటర్వ్యూకు పిలవడానికి ముందే వీసాను తిరస్కరిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఒక దేశం గురించి ఏదైనా తప్పుగా కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టినా, ఏదైనా దేశం కల్చర్, ప్రజల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా, హింసకు మద్దతిచ్చే పోస్టులు పెట్టినా, టెర్రరిజంలాంటి కార్యకలాపాలకు వంత పాడినా ఆయా దేశాలు వెంటనే వీసాను తిరస్కరిస్తున్నాయి. దానికీ కారణం లేకపోలేదు.
అడ్డదిడ్డమైన పోస్టులు పెట్టే వ్యక్తుల వల్ల తమ దేశానికి ముప్పు ఉంటుందని సదరు దేశం భావిస్తున్నది. అంతేగాకుండా క్రమశిక్షణ దెబ్బతింటుందని, దేశ సమగ్రతకు నష్టం కలుగుతుందని, అలాంటి వ్యక్తులతో టెర్రరిజంలాంటి ఘటనలు జరుగుతాయనే భయంతో సోషల్ మీడియా అకౌంట్స్‌ను చూసే వీసాలపై నిర్ణయం తీసుకుంటున్నారు.
అడ్డగోలుగా వాడితే నేరమే..
వాస్తవానికి సోషల్ మీడియా అనేది రెండంచుల కత్తి. మంచి, చెడు రెండూ ఉన్నాయి. అయితే చాలా మంది దానిని చెడు కోసమే ఎక్కువగా వినియోగించుకోవడం కలవరపరుస్తున్నది. హింసను ప్రేరేపించే కంటెంట్‌ను పోస్ట్ చేయడంతోపాటు కొన్ని వర్గాల మధ్య గొడవలు పెట్టేలా కంటెంట్ పోస్టు చేస్తున్నారు.
అంతేగాకుండా సెన్సిటివ్ కంటెంట్‌నూ వదలడం లేదు. వ్యూస్ కోసం, పైసల కోసం అసభ్యకరమైన వీడియోలు, కంటెంట్‌నూ పోస్ట్ చేసేందుకూ వెనుకాడడం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఇద్దరు టీనేజర్లు సన్నిహితంగా ఉన్న వీడియోను వైరల్ చేశారు. ఆ వీడియో కొన్ని కోట్ల మందికి చేరిపోయింది. ఇట్లాంటి ఘటనల వల్ల ఆ టీనేజర్ల భవిష్యత్తుకు భంగం కలిగే ప్రమాదం ఏర్పడింది. అంతేగాకుండా ఆ కుటుంబాలు తీవ్రమైన మానసిక క్షోభకూ గురవుతుంటాయి.
ఫేస్‌బుక్, ఎక్స్‌లాంటి ప్లాట్‌ఫాంలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల రెండు సున్నితమైన వర్గాల మధ్య అల్లర్లు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నా సోషల్ మీడియా అకౌంట్.. నా ఇష్టమంటే ఇక్కడ కుదరదు. ఇతరుల పరువును తీసేలా పోస్టులు చేసినా, విద్వేష వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు పెట్టినా, అసభ్య, అశ్లీల కంటెంట్‌ను పోస్ట్ చేసినా చట్టం ప్రకారం అది తీవ్రమైన నేరమే. భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67, సెక్షన్ 66ఈ ప్రకారం.. అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేస్తే దాదాపు పదేండ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు. రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్ట్ చేస్తే సెక్షన్ 153ఏ ప్రకారం, రెండు మతాల మధ్య ద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తే సెక్షన్ 295ఏ కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొన్ని తీవ్రమైన సెక్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. వాటి ప్రకారం లైఫ్ లాంగ్ జైల్లోనే గడిపే శిక్షలు పడొచ్చు.
ఇవి పాటించండి..
గౌరవం ఇవ్వండి: ఎదుటి వాళ్లను గౌరవించాలి. కులం, జాతి, లింగ వివక్షను దూరం చేయాలి. బెదిరింపులు, వేధింపులు, విద్వేష వ్యాఖ్యలు చేయకూడదు.
ఒక్కసారి ఆలోచించాలి: ఏదైనా పోస్టు పెట్టేముందు ఒక్క క్షణం ఆలోచించుకోవాలి. అది అవసరమా? అసలు నిజమా? కాదా?.. ఆ పోస్టును ఇతరులు చూస్తే ఇబ్బంది ఏమీ ఉండదా? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రైవసీ: ఇది చాలా పెద్ద విషయం. ఇతరుల ప్రైవసీని అర్థం చేసుకోవాలి. వారి పర్మిషన్ లేకుండా ఇష్టమొచ్చినట్టు ట్యాగ్ చేయొద్దు.
అథెంటిక్: అవసరమనుకుంటే జెన్యూన్ కంటెంట్‌నే పోస్ట్ చేయండి. సోషల్ మీడియా అనేది రియల్ లైఫ్ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
బాధ్యతగా ఉండాలి: సోషల్ మీడియాలో ఎప్పుడూ బాధ్యతయుతంగా ప్రవర్తించాలి. ఎవరైనా సరే బాధితులకు అండగా ఉండాలి. ఎవరైనా చెడు కంటెంట్‌ను పోస్ట్ చేస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి.
కంటెంట్: కంటెంట్ విషయంలో ఎప్పుడూ 80/20 రూల్ పెట్టుకోవాలి. అంటే 80 శాతం అక్కరొచ్చే సమాచారం, 20 శాతం పర్సనల్ కంటెంట్ పోస్ట్ చేయాలి. విలువైన, భవిష్యత్తును నిర్దేశించే కంటెంట్ ఏదైనా ఉంటే పోస్ట్ చేస్తే మేలు.
ఇంటరాక్షన్స్: ఎదుటి వారిపై ఆగ్రహపూరితమైన కామెంట్స్ చేయొద్దు. ఏదైనా సరే నిర్మాణాత్మకమైన డిస్కషన్ చేయాలి. కంట్రోల్‌లో ఉండాలి.
ఆన్‌లైన్ ఫ్రెండ్స్: ఆన్‌లైన్ ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసిన, నమ్మినవారితోనే చాట్ చేయాలి. కొత్త రిక్వెస్ట్‌లు వస్తే ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి. జాగ్రత్తపడండి.
ప్రొఫెషనలిజం: పని గురించి సోషల్ మీడియాలో మాట్లాడాల్సి వస్తే మీ పనేంటో తెలియజేయండి. కంపెనీ నుంచి అథరైజేషన్ లేకుండా.. ఎప్పుడూ సంస్థ అభిప్రాయాలను మీదేసుకోకుండా చూసుకోండి.
