అలాంటి భవనాలను నోటీసులివ్వకుండానే కూల్చేస్తాం: సైబరాబాద్ కమిషనర్ సృజన వార్నింగ్

అలాంటి భవనాలను నోటీసులివ్వకుండానే కూల్చేస్తాం: సైబరాబాద్ కమిషనర్ సృజన వార్నింగ్

సైబరాబాద్‌లోని అంజయ్యనగర్ ఘటన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన సీరియస్ అయ్యారు. నగరంలో అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణదారులకు కీలక నిబంధనలను గుర్తు చేశారు.

75 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం ఊరటనిచ్చిందని, దీనికి ఎలాంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదని కమిషనర్ సృజన స్పష్టం చేశారు. అయితే ఈ నిర్మాణాల ఎత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు మీటర్లకు మించకూడదని తేల్చిచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న 75 గజాల లోపు అక్రమ నిర్మాణాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తిస్తున్నారని వెల్లడించారు.

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన ఆమె.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అక్రమ భవనాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తక్షణమే కూల్చివేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలకు మాత్రం నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, ఖాళీ చేయించి కూల్చివేత చర్యలు చేపడతామని కమిషనర్ సృజన స్పష్టం చేశారు.