సోషల్ మీడియా పుణ్యమా అని.. దేశంలో వింతలు, విడ్డూరాలే కాకుండా జనం మూఢనమ్మకాలు బయటపడుతున్నాయి. పురాతన తవ్వకాల్లో దొరికినట్లు.. ఇప్పుడు ఓ వింత ఆచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లాలోని గావ్లీ పలాసియా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో జరిగిన వింత ఘటన.. ఇప్పుడు నెటిజన్లకే మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఇంతకీ ఆ విశేషాలు, వింత ఏంటో తెలుసుకుందామా..
ఇండోర్ జిల్లాలోని గావ్లీ పలాసియా గ్రామంలో వర్షాలు కురవాలని ఇంద్రుడిని ప్రార్థిస్తూ ఈ వింత అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓ వ్యక్తి పాడెపై పడుకొని ఉండగా.. గ్రామస్థులు పాడె మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వీడియోలో ఉంది.
చాలాకాలం పాటు వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు... బతికున్న మనిషిని పాడె మీద పడుకోబెట్టి వీధుల గుండా డప్పులు వాయిస్తూ ఊరేగించి అంత్యక్రియలు నిర్వహించడం తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమని అంటున్నారు గ్రామస్తులు.
ఈ ఆచారాన్ని చాలా కాలంగా పాటిస్తున్నామని.. సజీవంగా ఉన్న వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడం వల్ల వర్షానికి అధిపతి అయిన హిందూ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే.. వర్షాలు కురుస్తాయని నమ్ముతామని అంటున్నారు గ్రామస్థులు.
గతంలో కూడా ఈ ఆచారాన్ని పాటించామని, దాని ఫలితంగా మంచి వర్షాలు కురిశాయని స్థానికులు పేర్కొన్నారు.కొందరు ఈ ఆచారాన్ని మూఢనమ్మకంగా భావిస్తుండగా, గ్రామస్తులు మాత్రం దీనిని తమ విశ్వాసంలో, పాత సంప్రదాయంలో ఒక భాగంగా పరిగణిస్తున్నారు.
