మహిళలు టార్గెట్‌గా సైబర్ నేరాలు

మహిళలు టార్గెట్‌గా సైబర్ నేరాలు
  • ఇటీవల ఎక్కువగా నష్టపోతోంది వాళ్లే
  • స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈజీగా ట్రాప్
  • ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలి: సజ్జనార్

ఎక్కడో కూర్చుని సైబర్ నేరగాళ్లు ఈజీగా అమాయకులను దోచుకుంటున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఇటీవల ఈ సైబర్ నేరాలకు మహిళల్నే ఎక్కువగా టార్గెట్‌ చేసుకుంటున్నారని, వాళ్లే ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పారాయన. మాదాపూర్ హెచ్ఐసీసీ నోవోటెల్‌లో సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 5.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో ఎస్‌సీఎస్‌సీ వైస్ చైర్మన్ భరణి, మైక్రోసాఫ్ట్ ఎండీ, ఐడీసీ రాజీవ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు, ఐటీ ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. సైబర్ నేరాల అదుపు, భవిష్యత్తులో సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీసులు, సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, ట్రాఫిక్, మహిళ భద్రతపై సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ఏదేళ్లుగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు పెడుతున్నామన్నారు.

ఎక్కడో కూర్చొని సైబర్ నేరగాళ్లు మన సమాచారాన్ని దొంగిలించి అక్రమాలకు పాల్పడుతున్నారని, అమాయకులను రకరకాలుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు సజ్జనార్. సైబర్ క్రైమ్స్‌ని అరికట్టడానికి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తాము నిపుణుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా చాలా ఈజీగా సైబర్ నేరగాళ్లు డేటా చోరీ చేసి వాళ్ల ట్రాప్‌లోకి లాగేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ సైబర్ నేరాల నుంచి తమను కాపాడుకునేందుకు అవగాహన పెంచుకోవాలన్నారు సజ్జనార్. త్వరలో అన్ని స్కూల్స్, కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాల్లో మహిళలు ఎక్కువగా నష్ట పోతున్నారని, ఈ నెల 28న మహిళా భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు సీపీ.

More News:

చిన్నతనంలో నాపై రేప్ జరిగింది: అర్జున్ రెడ్డి ఫేం యాక్టర్

కుట్రలు సహించం: నిరసన పేరుతో ఆజాదీ అంటే దేశ ద్రోహమే