రెండు గంటల్లో 3 చైన్ స్నాచింగ్ లు..ఇద్దరు అరెస్ట్

రెండు గంటల్లో 3 చైన్ స్నాచింగ్ లు..ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు:  గచ్చిబౌలి, కూకట్ పల్లి, రామచంద్రాపురంలో వరుస చైన్ స్నాచింగ్​లకు పాల్పడ్డ  ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు.  ఈ నెల 26న  మియాపూర్‌‌ పీఎస్‌‌ పరిధి హెచ్‌‌ఐజీ గేట్‌‌ వద్ద చైన్ స్నాచింగ్ చేస్తున్న ఈ గ్యాంగ్ సభ్యులను పట్టుకోబోయిన కానిస్టేబుల్‌‌ యాదయ్యపై కత్తులతో దాడి చేసి పారిపోయిన సంగతి తెలిసిందే.  ఈ కేసు వివరాలను గురువారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆఫీసులో సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

గుల్బర్గా పోలీసులపై ఐరన్ రాడ్‌‌తో దాడి

కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన ఇషన్ నిరంజన్ నీలంనాలి(21), రాహుల్(19) స్థానికంగా వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ నెల 10న కర్నాటకలోని కలబుర్గి పీఎస్‌‌ పరిధిలో 13 బైకులను చోరీ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌‌ వచ్చారు. మళ్లీ 21న గుల్బర్గా వెళ్లారు. 22 నుంచి 24 తేదీల్లో అక్కడి జువెలరీ షాపుల్లో బంగారం చోరీకి స్కెచ్ వేశారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్స్ గురుమూర్తి, సంజీవ కుమార్‌‌ వారిని పట్టుకునేందుకు యత్నించారు. దీంతో నిందితులు ఇద్దరు ఐరన్ రాడ్ తో వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్స్‌‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాలిస్తుండడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయి మళ్లీ సిటీకి వచ్చారు. సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలోని శివారు ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్ లకు స్కెచ్ వేశారు.

రెండు గంటల్లో 3 స్నాచింగ్ లు

కొట్టేసిన బైక్ పై ఇషన్ నిరంజన్, రాహుల్  ఈనెల 25న  మధ్యాహ్నం 3  నుంచి 5 గంటల మధ్యలో గచ్చిబౌలి, కూకట్‌‌పల్లి, రామచంద్రాపురం పీఎస్‌‌ పరిధిలో 3 చైన్ స్నాచింగ్స్ చేశారు. బాధితుల కంప్లయింట్లతో సీసీఎస్‌‌ మాదాపూర్‌‌‌‌ జోన్‌‌ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలించారు. ఈ నెల 26న మియాపూర్‌‌‌‌ లో మరో రెండు చైన్ స్కాచింగ్ లకు నిందితులు స్కెచ్ వేశారు. ఆ తర్వాత  బీహెచ్‌‌ఈఎల్‌‌ రూట్‌‌లో పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అప్పటికే చైన్‌‌ స్నాచర్స్‌‌ కోసం  గాలిస్తున్న మాదాపూర్  సీసీఎస్‌‌ హెడ్‌‌ కానిస్టేబుల్‌‌ యాదయ్య, కానిస్టేబుల్స్ ధీబేష్‌‌, రవికి ఇద్దరు నిందితులు హెచ్‌‌ఐజీ గేట్‌‌ వద్ద కనిపించారు. వారిని పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్‌‌ యాదయ్యపై స్నాచర్లు కత్తితో దాడి చేశారు.  యాదయ్యకు 7 చోట్ల తీవ్రగాయాలయ్యాయి. అయిపనప్పటికీ ప్రాణాలకు తెగించి స్నాచర్లను పట్టుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వీరి నుంచి రివాల్వర్, తపంచా,15 లైవ్ బుల్లెట్స్‌‌,2  కత్తులు,47 గ్రాముల 
గోల్డ్‌‌ చైన్స్,సెల్‌‌ఫోన్స్‌‌, బైక్‌‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు.