కంపెనీ ఎండీగా నమ్మించి రూ.25 లక్షలు కొట్టేశారు..ప్రెస్ట్రీస్ ప్రోడక్ట్స్ కంపెనీ ఎండీకి టోకరా

కంపెనీ ఎండీగా నమ్మించి రూ.25 లక్షలు కొట్టేశారు..ప్రెస్ట్రీస్ ప్రోడక్ట్స్ కంపెనీ ఎండీకి టోకరా

బషీర్​బాగ్, వెలుగు: ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా నమ్మించి ఆ కంపెనీ అకౌంట్స్​ మేనేజర్​ నుంచి సైబర్​ నేరగాళ్లు భారీగా డబ్బు ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం... ప్రెస్ట్రీస్ ప్రోడక్ట్స్ కంపెనీ ఎండీ ఇటీవల సెలవుపై శ్రీలంకకు వెళ్లారు. ఈ నెల 24న స్కామర్స్ ఆయన పేరుతో ఆ కంపెనీ అకౌంట్స్ మేనేజర్ కు వాట్సప్​ మెసేజ్ చేశారు. 

కంపెనీ ఫండ్స్ కు సంబందించిన స్క్రీన్ షాట్ ను పంపాలన్నారు. ఎండీనే అనుకున్న అకౌంటర్స్​ మేనేజర్ రూ.28 లక్షలు ఉన్నట్లు స్క్రీన్ షాట్ పంపారు. ఓ ప్రాజెక్ట్ కు డబ్బులు అవసరం ఉన్నాయని తెలిపిన స్కామర్స్.. నెఫ్ట్ ద్వారా రూ.25 లక్షలను పంపించాలని కోరారు. వెంటనే అకౌంటర్స్​ మేనేజర్ ఆ డబ్బులను ట్రాన్స్​ఫర్ చేశాడు. మళ్లీ రూ.40 లక్షలు పంపాలని కోరడంతో అనుమానం వచ్చి ఎండీ నంబర్​కు కాల్​ చేయగా, తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని చెప్పారు. ఇది స్కామ్​ అని గ్రహించి సైబర్ క్రైమ్​కు ఫిర్యాదు చేశారు.

ఇద్దరు సైబర్​ నేరగాళ్లు అరెస్ట్​..

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్​ నేరగాళ్లు మోసగించడంతో ఇటీవల మలక్​పేటలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు సైబర్ చీటర్స్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన శంకర్ సుపుర్, విశ్వాస్ దత్తాత్రేయ మిరాజేలను నిందితులుగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు. రెండు ఫోన్లు సీజ్ చేసి  రిమాండ్ కు పంపారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఫోన్ కాల్ వస్తే భయపడరాదని, కాల్ కట్ చేయాలని పోలీసులు సూచించారు.