- అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసుల సూచన
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. వృద్ధులు, మధ్య వయస్సు వ్యక్తులను సైబర్ నేరాలకు డిజిటల్ ప్లాట్‌పామ్‌గా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారితో ఇతరుల వాయిస్, ఫింగర్ ప్రింట్, ఫేస్ క్యాప్చర్ చేయించి.. ఆన్‌లైన్ లోన్స్ తీసుకుంటున్నారు. ఈ మోసాల తీరును హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి మీడియాకు మంగళవారం వివరించారు. సోషల్ మీడియా ద్వారా డబ్బు ఆశ చూపి వృద్ధులు, మధ్య వయస్సు వారిని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారు.
వీరిని నేరాలకు ప్రేరేపిస్తూ, వారి మొబైల్ ఫోన్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంబంధిత బయోమెట్రిక్ ఐడెంటిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఆ తర్వాత వారిని మాల్స్, మెట్రో స్టేషన్స్, మార్కెట్లు, పబ్లిక్ ప్లేసెస్‌లో ప్రొఫెషనల్ డ్రెస్‌తో పంపిస్తున్నారు. అనంతరం వృద్ధులు, మధ్య వయస్సు వ్యక్తులు.. ఏఐ బయోమెట్రిక్ ఐడెంటిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తమ ఫోన్ ను ఇతరులకు ఇస్తున్నారు. 'ఫోన్ ఎలా వాడాలో తెలియదు', 'పెన్షన్ చెక్ చేయాలి', 'తప్పుగా బటన్ నొక్కాను'అంటూ సహాయం కోరుతున్నారు.
దాంతో సాయం చేసేందుకు ఫోన్ తీసుకుని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి.. ఫేస్ రికగ్నేషన్, ఫింగర్ ప్రింట్ , వాయిస్ వంటి బయోమెట్రిక్ డేటా క్యాప్చర్ అవుతున్నది. ఈ డేటాతో సైబర్ నేరగాళ్లు డిజిటల్ క్లోన్ సృష్టించి, ఆన్‌లైన్ లోన్లు, క్రెడిట్ ఫైనాన్స్, క్యాష్ లోన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా బాధితుల అకౌంట్లలో డబ్బు తగ్గకపోయినా, ఆన్‌లైన్ అప్పుల్లో మాత్రం కూరుకుపోతున్నారు. అందువల్ల గుర్తు తెలియని వ్యక్తుల మొబైల్ ఫోన్లు ఆపరేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
