తెలంగాణపై ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ .. నేడు (సెప్టెంబర్ 24) 5 జిల్లాలు.. రేపు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణపై ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ .. నేడు (సెప్టెంబర్ 24) 5 జిల్లాలు.. రేపు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్, వెలుగు: ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గడ్​పై ప్రభావం చూపుతున్న 'ఆర్నబ్' తుఫాన్ తెలంగాణపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌కు ఆనుకుని ఉండే జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

దీంతో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

కాగా, ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర వాయుగుండంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కల్లూరులో 7.2 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 6.3, వనపర్తి జిల్లా పానగల్‌‌‌‌‌‌‌‌లో 5.7, పెద్దపల్లి జిల్లా కూనారంలో 5.5, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 5.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్కారంలో 5.1, అశ్వారావుపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడగా, హైదరాబాద్ నగరంలో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.