పోటెత్తిన తీరం.. 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకనున్న తుఫాన్

 పోటెత్తిన తీరం.. 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకనున్న తుఫాన్

గుజరాత్ తీరాన్ని తాకనున్న బైపార్జోయ్ తుఫాన్.. బీభత్సం చేయటం ఖాయమని అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మరో 36 గంటల్లో.. అనగా.. 2023 జూన్ 15వ తేదీ ఉదయం ద్వారక.. కచ్ ప్రాంతాల మధ్య 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఆ ప్రాంతంలో విధ్వంసం ఖాయంగా కనిపిస్తుంది. 

దీంతో  గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలోని తీరప్రాంత గ్రామాల నుండి 4 వేల 700 మందికి పైగా ప్రజలను 2023 జూన్ 13 మంగళవారం రోజున ఖాళీ చేసి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  చేపల వేట పనులను  కూడా నిలిపివేశారు. కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. జూన్ 15 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.  మంగళవారం ఉదయం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ,మత్స్య శాఖ సహాయ మంత్రి పర్షోత్తం రూపాలా దేవభూమి ద్వారకా జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు. 

అటు సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు నడపటం లేదని పశ్చిమ రైల్వే సీపీఆర్వో సుమిత్ ఠాకూర్ తెలిపారు.  బిపార్జోయ్ తుఫాను  గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక మరియు జామ్‌నగర్ జిల్లాలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. గుజరాత్‌లోని వల్సాద్, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, అమ్రేలి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది.

 బైపార్జోయ్ తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తుఫాను పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు.  

బైపార్జోయ్ తుఫాను నేపథ్యంలో వైద్యారోగ్య పరిస్థితులను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతోపాటు భోజన ఏర్పాట్లను షెల్టర్ హోమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం తెలిపారు. తీరప్రాంతాల్లోని ఓడరేవుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ ఖాళీ చేయించి, ఓడలకు లంగరు వేసి, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.