దిత్వా ఎఫెక్ట్.. తమిళనాడులో కుండపోత.. కావేరి డెల్టా జిల్లాలు అతలాకుతలం

దిత్వా ఎఫెక్ట్.. తమిళనాడులో కుండపోత.. కావేరి డెల్టా జిల్లాలు అతలాకుతలం
  • ముగ్గురు మృతి.. పంట, ఆస్తి నష్టం
  • రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

చెన్నై: దిత్వా తుఫాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలో విధ్వంసం సృష్టించిన ఈ తుఫాన్ తమిళనాడు– పుదుచ్చేరి తీరం వైపు దూసుకొస్తున్నది. కావేరి డేల్టా జిల్లాలైన కడలూరు, నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్ పై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తమిళనాడు రెవెన్యూ శాఖ మినిస్టర్ కేకేఎస్​ఎస్​ఆర్ రాంచంద్రన్ ప్రకటించారు. 

తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. మైలాడుతురైలో కరెంట్ షాక్​తో 20 ఏండ్ల యువకుడు చనిపోయాడు. రానున్న 24 గంటల్లో కడలూర్, నాగపట్నం, మైలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, అరియలూరు, పెరంబలూరు, తిరుచిరాపల్లి, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట్, పుదుచ్చేరి, కారైకాల్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

140 ఎకరాల్లో పంట నష్టం

భారీ వర్షాలతో కావేరీ డెల్టా ప్రాంతంలో దాదాపు 140 ఎకరాల్లో పంట నీట మునిగింది. ముఖ్యంగా నాగపట్నం, తిరువారూర్, మైలాడుతురై జిల్లాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 149 పశువులు మృత్యువాతపడ్డాయని, 200కి పైగా గుడిసెలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా తెలిసింది. ప్రభుత్వం 28 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. అదనంగా మరో 10 బృందాలు చెన్నైకు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఆదివారం సాయంత్రం నాటికి గడిచిన 24 గంటల్లో కారైకాల్​లో 19 సెంటీ మీటర్లు, మైలాడుతురైలో 17 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంవైపు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. సుమారు 250 ఇండ్లు కూలిపోయాయి. రామేశ్వరం, వేదారణ్యంలో రోడ్లన్నీ నీట మునిగాయి. 9 జిల్లాల్లో 38 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాల్లో గంటలకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి

శ్రీలంకలో 200 దాటిన మరణాలు

దిత్వా తుఫాన్ కారణంగా శ్రీలంక తీవ్రంగా నష్టపోయింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సుమారు 212 మందికి పైగా చనిపోయారని అక్కడి అధికారులు ప్రకటించారు. మరో 218 మంది ఆచూకీ దొరకడం లేదు. దాదాపు 2.73 లక్షల కుటుంబాల్లోని 10 లక్షల మంది ప్రజలు తుఫాన్ ప్రభావానికి లోనయ్యారు. శ్రీలంక ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ’ ప్రకటించింది. 20 వేలకు పైగా ఇండ్లు కూలిపోయాయి. 10 లక్షల మంది వరకు రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. కొలంబోను కెలాని నది ముంచెత్తింది. వెల్లాంపిటియా, సమ్మంథురై, చలై లాగూన్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 

ఎస్టర్న్, సదరన్, వెస్టరన్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లలో వరద విధ్వంసం సృష్టించింది. 600 ఇండ్లకు పైగా పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. పొలాలు నీట మునిగాయి. రోడ్లు, విమానాశ్రయాలను వరద ముంచెత్తింది. పలు విమానాలను అధికారులు డైవర్ట్ చేశారు. ప్రపంచ దేశాలు ఆదుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిస్సనాయకే కోరారు. శ్రీలంక కష్టకాలంలో ఉండగా, ఇండియా ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో భారీ సహాయక చర్యలు చేపట్టింది. ఇండియా నుంచి 80 మంది సభ్యులతో కూడిన 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను శ్రీలంకకు పంపింది.