ఏపీలో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ

ఏపీలో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ

మిచాంగ్ తుఫాను డిసెంబర్4 సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజులుగా బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా చెన్నై, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

శుక్రవారం (డిసెంబర్2)న అల్పపీడనం మరింత బలపడి డిసెంబర్ 3న తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 4 సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం,చెన్నై మధ్య మిచాంగ్ తీరం దాటుతుందని ఐఎండీ వెల్లడించింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆగ్నేయ, నైరుతి ప్రాంతంలోని పుదుచ్చేరికి ఆగ్నేయంగా 730 కి.మీ., చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 740 కి.మీ. నెల్లూరు ఆగ్నేయంగా 860 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. 

అల్పపీడనం డిసెంబర్2 నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్3 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫాను మారు తుం దని..మరుసటి రోజు దక్షిణ ఆంధ్రప్రదేశ్ ను ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు తీరానికి చేరుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి డిసెంబర్ 5న నెల్లూరు , మచిలీపట్నం మధ్య తుపాను 80-90 కి.మీ వేగంతో తీరం దాటుతుందని తెలిపింది. 

తుపాను ప్రభావంతో డిసెంబర్ 4, 5వ తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ చేసింది. డిసెంబర్ 5న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 

డిసెంబర్ 3న రాయలసీమ, కోస్తా,యానాంలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలెర్ట్ ను ప్రకటించింది. అదే రోజు ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్  ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారి చేసింది వాతావరణ శాఖ. 

తుపాను ప్రభావంలో డిసెంబర్ 1 నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా గంటకు 50-60 కి.మీ వేగంతో, డిసెంబర్2న ఉదయం 60నుంచి 70 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది.