బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన ఈ అల్పపీడనం 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ & నికోబార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంపై మొదటగా బలపడి వాయుగుండంగా మారవచ్చు .
సెన్యార్ తుఫాను
ఈ వ్యవస్థ తీవ్రమై తుఫానుగా మారితే, దానికి 'సెన్యార్' అని పేరు పెట్టనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పదానికి సింహం అని అర్థం. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం..అల్పపీడనం తుఫాన్ గా మారితేనే అధికారికంగా పేరు ప్రకటిస్తారు. ఈ తుఫాన్ కదలికలపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని వివరిస్తూ.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తమిళనాడు, కేరళ రాష్ట్రాల మత్స్యకారులకు సూచించారు వాతావరణ శాఖ అధికారులు. గాలులు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయని.. తీర ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.
ఏ రాష్ట్రాల్లో ఎపుడు వర్షాలు
నవంబర్ 25 నుంచి 27 వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని, నవంబర్ 28 నుంచి 30 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 26న కేరళ మాహేలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అండమాన్ నికోబార్ దీవులలో నవంబర్ 25, 29 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని, నవంబర్ 26, 28 మధ్య అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. నవంబర్ 27 , 28 తేదీలలో కోస్తా ఆంధ్ర , యానాంలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురుస్తాయి.
నవంబర్ 25 నుంచి 28 వరకు తమిళనాడులో నవంబర్ 24 నుంచి 26 వరకు కేరళలో నవంబర్ 24న లక్షద్వీప్‌లోఅండమాన్ నికోబార్ దీవులలో రాబోయే ఆరు రోజుల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రస్తుతానికి వాతావరణం పొడిగా.. చల్లగా ఉంటుందని.. 48 గంటల తర్వాతనే స్పష్టత వస్తుందని వివరించింది వాతావరణ శాఖ.
