- ఓపీఎస్ సాధ్యాసాధ్యాలపై 3 నెలల్లో కమిటీ నివేదిక
- సీఎస్‌తో చర్చల అనంతరం మీడియాతో టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు పూర్తి సానుకూలంగా ముగిశాయని టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వడ్నాల రాజశేఖర్ తెలిపారు. సచివాలయంలో బుధవారం సీఎస్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) తన సమగ్ర నివేదికను ఈ నెల 18వ తేదీలోపు సీఎస్‌కు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
అదే రోజు నిర్వహించే తదుపరి ఉన్నత స్థాయి భేటీలో డీఏ బకాయిల విడుదలకు సంబంధించి పూర్తి స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ నెల 6న తాము నిర్వహించిన ‘ఉద్యోగుల సంకల్ప సభ’, ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన సంప్రదింపులకు కొనసాగింపుగా ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని వివరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తమైన నిరసనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి వేగంగా స్పందించడం శుభపరిణామమని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై త్వరలోనే క్షేత్రస్థాయిలో సానుకూల నిర్ణయాలు వెలువడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగ వర్గాల చిరకాల ఆకాంక్ష అయిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించే అంశంపై సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చించినట్టు తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక అభద్రతలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. దీని సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఈ మేరకు మూడు నెలల నిర్దిష్ట కాలపరిమితితో ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్టు చెప్పారు.
పకడ్బందీగా హెల్త్ కార్డులు..
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యుల వైద్య భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని లచ్చిరెడ్డి, రాజశేఖర్ తెలిపారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎలాంటి తిరస్కరణలు లేకుండా నగదు రహిత కార్పొరేట్ వైద్యం అందేలా ఉద్యోగుల హెల్త్ కార్డుల (ఈహెచ్ఎస్) విధానాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నేతలు కోరగా.. హెల్త్ కార్డులను పకడ్బందీగా అమలు చేస్తామని సీఎస్ స్పష్టమైన హామీ ఇచ్చారని వివరించారు.
ఆర్థికపరమైన అంశాల్లో భాగంగా వివిధ కేటగిరీల్లో పేరుకుపోయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన విడుదల చేయాలని కోరగా త్వరితగతిన బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. అలాగే, ఉద్యోగుల ఆర్థిక, పరిపాలనాపరమైన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం–జేఏసీ మధ్య నిరంతర సంప్రదింపుల వ్యవస్థ కొనసాగాలని నిర్ణయించిందన్నారు. సచివాలయం వద్ద నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో ప్రధాన భాగస్వామ్య సంఘాల నేతలు రాములు, రమేశ్ పాక, దర్శన్ గౌడ్, కుమారస్వామి, ఉపేందర్, బిక్షుమ్ యాదవ్, రాబర్ట్ బ్రూస్ తదితరులు పాల్గొన్నారు.
