నాన్నకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చా 

నాన్నకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చా 
  • కేసీఆర్‌‌ నన్ను ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌గా చూడాలనుకున్నరు: మంత్రి కేటీఆర్‌‌
  • అధికారంలోకి వచ్చాక 1.3 లక్షల గవర్నమెంట్‌‌ జాబులిచ్చినం
  • దళితులను దారిద్య్ర రేఖ దాటించేందుకే దళిత బంధు
  • ఏ పథకం తెచ్చినా అంతుచూసే దాకా సీఎం నిద్రపోరన్న మంత్రి


రామచంద్రాపురం, వెలుగు: నాన్నకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి కేటీఆర్ చెప్పారు. తనను ఐఏఎస్ ఆఫీసర్‌‌గా చూడాలని కేసీఆర్​అనుకున్నారని, అందుకే ఢిల్లీలోని జేఎన్‌‌యూకు పంపించారన్నారు. కానీ అక్కడి గోడ మీద ‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క దాన్నీ రాజకీయాలే నిర్ణయిస్తాయి.. మీ భవిష్యత్​ఏంటో మీరే నిర్ణయించుకోండి’ రాతలు చూసి తన మనసు మారిందన్నారు. జేఎన్‌‌యూలో చేరకుండానే అమెరికా వెళ్లి జాబ్‌‌లో చేరానని, యూపీఏ నుంచి టీఆర్‌‌ఎస్ బయటకు వచ్చినప్పుడు తానూ ఉద్యోగం వదిలి వచ్చానని చెప్పారు. తాను ఉద్యోగం వదిలి వచ్చిన విషయం తండ్రికి చెప్పలేదని, తన అభిప్రాయాన్ని నాన్న కాదనరనే నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ స్టూడెంట్స్‌‌తో ఇంటరాక్షన్ మీటింగ్‌‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 
విద్యుత్‌‌ తలసరి వాడకంలో దేశంలోనే ఫస్ట్‌‌
తాము అధికారంలోకి వచ్చాక 1.3 లక్షల గవర్నమెంట్ జాబ్‌‌లు ఇచ్చామని, మొత్తం 15 లక్షల మందికి ఉపాధి కల్పించామని కేటీఆర్ చెప్పారు. జోనల్ వ్యవస్థతో 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చూశామన్నారు. తెలంగాణలో ఏ స్కీం తెచ్చినా, ఏ  ప్రాజెక్టు ప్రారంభించినా దాని అంతుచూసేదాకా కేసీఆర్​నిద్రపోరని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గిపోవాల్సిందేనన్న పరిస్థితి నుంచి నేడు 16 వేల మెగావాట్ల విద్యుత్‌‌ను పెంచి తలసరి వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చామని అన్నారు. తాగే నీళ్ల కోసం సిఫార్సు చేసుకునే స్థాయి నుంచి రూ. 45 వేల కోట్లతో 14 లక్షల కిలోమీటర్ల తాగునీటి పైప్​ లైన్లు వేసుకునే స్థాయికి వచ్చామని, మిషన్ భగీరథతో ప్రతి గడపకు నీళ్లందించామని తెలిపారు. లక్ష కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ లిఫ్ట్​ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించుకున్నామని, నేడు కాళేశ్వరం ద్వారా 40 వేల చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు.  ఏడేళ్లలో రాష్ట్రానికి రూ. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.  
దళిత బంధు స్కీం అందుకే..
దళిత బంధు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారని సినీ నటి పూనమ్‌‌ కౌర్‌‌ ప్రశ్నించగా.. రైతు బంధు, ఇతర పథకాల్లాగే దీన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని కేటీఆర్‌‌ చెప్పారు. దళిత బంధు స్కీం లాగే మైనారిటీ బంధు, బీసీ బంధు ఎందుకివ్వట్లేదని అంటున్నారని.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా దళితులు దారిద్ర్యరేఖకు దిగువే ఉండిపోయారని, అనేక సర్వేల్లోనూ ఇది తేలిందని అన్నారు. దళితులను దారిద్ర్య రేఖ దిగువ నుంచి పైకి తేచ్చేందుకే స్కీం తెచ్చామన్నారు. 4, 5  సంవత్సరాల్లో దళితులందరికీ స్కీం అమలుచేయడం కష్టం కాదన్నారు. ప్రభుత్వం ఏ స్కీం తెచ్చినా ఎక్కడా పైసా వేస్ట్‌‌ అవదని, ఏదోలా రెవెన్యూ తెస్తుందని చెప్పారు. ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై స్టడీ చేసి నివేదికలు సమర్పించాలని స్టూడెంట్స్‌‌కు కేటీఆర్ సూచించారు.