యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలో ఇప్పటివరకు స్వాతి నక్షత్రం రోజునే నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణను ఇక నుంచి ప్రతిరోజూ నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టలోని వైకుంఠ ద్వారం వద్ద నారసింహుడి పాదాలకు శుక్రవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఈవో భవానీ శంకర్ ప్రత్యేక పూజలు చేసి ‘నిత్య గిరిప్రదక్షిణ’ ప్రారంభించారు. తెల్లవారుజామున 5.30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులతో కలిసి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం కొండపైకి చేరుకుని స్వయంభు నారసింహుడిని దర్శించుకున్నారు.
గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు దేవస్థాన ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఎమ్మెల్యే అయిలయ్యకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించిన అనంతరం వేదాశీర్వచనం చేసి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. అంతకుముందు స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు శతఘటాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు.
