సౌత్ వెస్ట్.. రోజుకో స్ట్రీట్ ఫైట్.. మొన్న ఆసిఫ్ నగర్, నిన్న హబీబ్ నగర్.. ఇప్పుడు నాంపల్లిలో

సౌత్ వెస్ట్.. రోజుకో స్ట్రీట్ ఫైట్.. మొన్న ఆసిఫ్ నగర్, నిన్న హబీబ్ నగర్.. ఇప్పుడు నాంపల్లిలో

మెహిదీపట్నం, వెలుగు: సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో వరుసగా స్ట్రీట్ ఫైట్స్ కలకలం రేపుతున్నాయి. గతవారం టోలీచౌకిలో, ఆసిఫ్ నగర్‏లో స్ట్రీట్ ఫైట్స్ జరగగా.. ఆదివారం రాత్రి హబీబ్ నగర్ పరిధిలోని నాంపల్లి దర్గా సమీపంలో స్ట్రీట్ ఫైట్ జరిగింది. ఆదివారం ఘటన గురించి పోలీసులను అడిగితే ‘అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి గొడవే అది.. స్ట్రీట్​ఫైట్​ఏం కాదు’ అని వివరణ ఇచ్చారు. ఫిర్యాదు చేసేందుకు కూడా ఎవరు రాలేదని తెలిపారు. 

శుక్రవారం రచ్చ రచ్చ

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఓ కాలేజీ విద్యార్థుల రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. మెహిదీపట్నంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్​స్టూడెంట్స్​మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. సాయంత్రం గొడవ జరగ్గా.. రాత్రి వేళ మురాద్​నగర్‎లో రోడ్లపై రోడ్లపై రెండు గ్రూపులుగా చేరి కర్రలతో కొట్టుకున్నారు. 

ఈ ఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసం కాగా, ముగ్గురు గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై ఆసిఫ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, నెల రోజుల కింద టోలీచౌకీలోని రోడ్లపై కొందరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనపై టోలీచౌకి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా నాంపల్లి పీఎస్​పరిధిలోని దర్గా వద్ద నడి రోడ్డుపై కొందరు కొట్టుకుని న్యూసెన్స్​ సృష్టించారు. 

సరిగ్గా పెట్రోలింగ్ లేకనే..

పోలీసులు సరిగ్గా పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ జోన్​పరిధిల్లోని బస్తీల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బయట గ్రూపులుగా కూర్చుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే  దాడులకు దిగుతున్నారని వాపోతున్నారు. 15 రోజుల క్రితం టప్పాచ బుత్రలోని గంగాబౌలి నటరాజ్ నగర్‎లో అరుగుల మీద కూర్చున్న యువకులను పెట్రోలింగ్ పోలీసులు ఇంట్లోకి వెళ్లమంటూ హెచ్చరించారు.

అయినా పట్టించుకోని వారు పోలీసులపైనే తిరగబడ్డారు. దుర్భాషలాడడంతో సీఐకి చెప్పగా ఆయన కూడా లైట్ తీసుకున్నారు. దీంతో విషయాన్నిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సీఐపై సస్పెన్షన్​వేటు వేశారు. సీరియస్​యాక్షన్​తీసుకుంటే ఈ ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు కోరుతున్నారు.