- 17న రాత్రి సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న యువతి
- ఆ టైమ్‌లో మాట్లాడుకుందామని పిలిచి
- తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన యువకుడు
అడ్డాకుల, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. దళిత యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయింది. మూసాపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) ఇంటర్ పూర్తి చేసి, ఇంట్లోనే ఉంటున్నది. అదే గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడు పెయింటర్‌గా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వాళ్ల గ్రామంలో బుధవారం సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. దీంతో అదే రోజు రాత్రి గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి యువతి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న విష్ణు.. తన ముగ్గురు స్నేహితులతో ర్యాలీకి వచ్చాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందామని చెప్పి, ఆమెను పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి రైతు వేదిక సమీపంలోని ప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లాడు. అనంతరం యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత బాధితురాలి తల్లిదండ్రులకు విష్ణు ఫోన్ చేసి ‘మీ బిడ్డ కిందపడిపోయింది’ అని చెప్పడంతో.. వాళ్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను తీసుకొని స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, మహబూబ్‌నగర్ తీసుకెళ్లాలని అతడు సూచించాడు. దీంతో వెంటనే మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.
గ్రామస్తుల ఆందోళన..
ఈ ఘటన గురించి గురువారం ఉదయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ గ్రామానికి చేరుకొని స్పాట్‌ను పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు గురువారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో విష్ణుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
