
- సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించకుండా వివక్ష చూపడం దారుణం
- ఎంపీ వంశీకృష్ణకు మద్దతుగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నిరసన
ట్యాంక్‌బండ్/ముషీరాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై వివక్ష చూపడం దారుణమని దళిత సంఘాలు మండిపడ్డాయి. సరస్వతి పుష్కరాలకు ఎంపీని ఆహ్వానించకపోవడం దళితులకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని తెలిపాయి. ప్రభుత్వం, అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. వంశీకృష్ణను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అవమానించడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు రాజు ఉస్తాద్, బిట్ల వెంకటేశ్వర్లు నేతృత్వంలో పలువురు మంగళవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
భారీగా తరలివచ్చిన దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జేఏసీ చైర్మన్ చెన్నయ్య, మన్నె శ్రీధర్, జంగా శ్రీనివాస్, బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సరస్వతి నది పుష్కరాల్లో ఎంపీ వంశీకృష్ణకు ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వివక్ష చూపారని మండిపడ్డారు. పుష్కరాల్లో ఎంపీని కావాలనే అవమానించారని ఆరోపించారు. ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో లేకపోవడంతో నిరసన తెలిపిన కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఈ విషయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామని, బాధితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ ఘటనపై స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దయానంద్, యాదగిరి, బిల్డర్ రమేశ్, ప్రవీణ్ కుమార్, దుబ్బాక నవీన్, గోపోజు రమేశ్ బాబు, మహిళా సంఘం నాయకురాలు చంద్రప్రభ, శోభారాణి, అనిత, సరస్వతి, కవిత, వీణ, సంగీత తదితరులు పాల్గొన్నారు.
వంశీకృష్ణను అవమానిస్తే ఊరుకోం: రమేశ్ బాబు
సరస్వతి పుష్కరాల్లో ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్ బాబు హెచ్చరించారు. ఎంపీని అవమానించడాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్‌పై మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో రమేశ్ బాబు మాట్లాడుతూ.. కావాలనే ఎంపీ వంశీకృష్ణను అవమానించారన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఢిల్లీలో ఆందోళనలు చేపట్టి, ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.