షాద్ నగర్, వెలుగు: పరువు పేరుతో దళిత యువకుడిని హత్య చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో పెట్రేగిపోతున్న కుల వివక్షను రూపుమాపడానికి హిందూ, సనాతన ధర్మ రక్షకులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ, కాంగ్రెస్ నాయకుడు జంగారు రవి, బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ ఉన్నారు.
రాజశేఖర్ కుటుంబానికి ఆర్ఎస్ ప్రవీణ్ పరామర్శ..
షాద్నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్ హత్యలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందన్నారు. సంబంధిత పోలీసు అధికారులను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
