- దళిత సేన, సింగరేణి ఎస్సీ, ఎస్టీ జేఏసీ హెచ్చరిక
పంజాగుట్ట/ట్యాంక్ బండ్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నైతికంగా దెబ్బతీసేందుకే ఓ దినపత్రిక అసత్య ప్రచారం చేస్తోందని, దీనిని సవరించుకోకుంటే ప్రజా ఉద్యమం తప్పదని దళిత సేన జాతీయ అధ్యక్షుడు జేబీ రాజు హెచ్చరించారు. అత్యున్నత స్థానాల్లో ఉన్న దళిత నాయకులపై కేవలం కుల పిచ్చితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
డిప్యూటీ సీఎంపై విష ప్రచారం చేస్తుంటే దళిత ఉద్యోగులుగా భరించలేక, వాస్తవాలు అందరికీ తెలియాలని ఒక అధికారి హోదాలో ముందకొచ్చామన్నారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సింగరేణి ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్, డిప్యూటీ జనరల్ మేనేజర్గోళ్ల రమేశ్ మీడియాతో మాట్లాడారు. సింగరేణి విషయంలో కనీస అవగాహన లేకుండా ఒక పత్రిక వార్తలు ప్రచురించిందని పేర్కొన్నారు.
బొగ్గు టెండర్లలో ఫీల్డ్ విజిట్‌పై అవగాహన లేని రాతలు రాశారని ఫైర్ అయ్యారు. అనంతరం ఆరేపల్లి రాజేందర్ మాట్లాడుతూ.. సింగరేణి ఎప్పుడూ సీఎం ఆధీనంలో ఉండేదని, ప్రస్తుతం మంత్రి ఆధీనంలో ఉందని తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. చొప్పర బాలకృష్ణ మాట్లాడుతూ.. తప్పుడు వార్తలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరాధారమైన వార్తలను ఆపకపోతే భారీ ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ మాదిగ సంఘాల మహా కూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ అన్నారు. అట్టడుగు వర్గాల గొంతుక 40 ఏండ్లుగా రాజకీయ జీవితంలో ఉంటూ చట్టసభల్లో మాట్లాడుతున్న భట్టిపై జర్నలిజం ముసుగులో చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆ పత్రిక తన కథనాలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో దళితసేన నాయకులు మహేశ్వర్‌రాజ్, భూక్యా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
