వాసాలమర్రిలో 66 మందికి దళితబంధు పైసలు

వాసాలమర్రిలో 66 మందికి దళితబంధు పైసలు

పది లక్షల చొప్పున ఖాతాల్లో జమ చేసిన ఆఫీసర్లు

మరో 10 మందికి త్వరలో ఇస్తామని వెల్లడి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో 66 మంది ఎస్సీల ఖాతాల్లో ‘దళిత బంధు’ డబ్బు లు జమయ్యాయి. తన దత్తత గ్రామమైన వాసాలమర్రిని గత నెల 4న దళిత బంధుకు సీఎం కేసీఆర్​ ఎంపిక చేశారు. మరుసటి రోజు  76 దళిత కుటుంబాలకు సంబంధించి రూ. 7.60 కోట్లు కలెక్టర్​ ఖాతాలో జమ చేశారు. డెయిరీ, పౌల్ట్రీ, ట్రాన్స్​పోర్ట్​, సెంట్రింగ్​, వెల్డింగ్, ల్యాండ్​ డెవలప్​మెంట్​ యూనిట్లను దళిత కుటుంబాలు ఎంపిక చేసుకున్నాయి.

వీటి గురించి నెల రోజులుగా ఆఫీసర్లు అవగాహన కల్పించారు. కొత్తగా ‘దళిత బంధు’ ఖాతాలు తీసుకోవాలని సూచించగా.. 66 మంది ప్రూప్స్​ ఇవ్వగా మరో 10 మంది ఇవ్వలేదు.  ప్రూప్స్​ ఇచ్చిన వారికి అధికారులు ఖాతాలు ఓపెన్​ చేయించి, ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 10  లక్షల చొప్పున జమ చేశారు. అయితే.. వాటిని లబ్ధిదారులు తీసుకోకుండా అకౌంట్​లో ఫ్రీజ్​ చేశారు. యూనిట్​ ఇచ్చే  కంపెనీకే   డబ్బును ట్రాన్స్​ఫర్ ​ చేయనున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారు తాను ఎంపిక చేసుకున్న యూనిట్​కు సంబంధించిన ఎస్టిమేట్​తో పాటు ఆ యూనిట్​ ఇచ్చే కంపెనీ  లేదా సంస్థకు సంబంధించిన డిటైల్స్​ను బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. ఆతర్వాతే అమౌంట్​ను కంపెనీ లేదా సంస్థ అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​ చేస్తారు. వర్కింగ్​ అవసరాల కోసం కొంత మొత్తం నగదును లబ్ధిదారులకు అందివ్వనున్నారు. యూనిట్​ ప్రారంభమైన తర్వాత ఒక్కో లబ్ధిదారు ఖాతాలోంచి రూ. 10 వేల చొప్పున ‘దళిత రక్షణ నిధి’కి జమ చేయనున్నారు. ప్రూప్స్​​ ఇవ్వని మిగిలిన పది మందికి కూడా త్వరలో దళిత బంధు ఖాతాలు ఓపెన్​ చేయిస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. 

పౌల్ట్రీ, డెయిరీపై క్షేత్రస్థాయి పర్యటన

దళిత బంధు పథకం కింద డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లను ఎంచుకున్న వాసాలమర్రికి చెందిన 26 మంది లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్​ ఆఫీసర్లు క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లారు. జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం, చిన్నకందుకూరు.. భువనగిరి మండలంలోని రాయగిరి, కూనూరులోని డెయిరీ, పౌల్ట్రీ ఫామ్స్​కు తీసుకెళ్లారు. అక్కడి రైతులు డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహణపై లబ్ధిదారులకు వివరించారు. ఎలాంటి పద్ధతులు పాటిస్తే పౌల్ట్రీ, డెయిరీ రంగంలో మంచి ఆదాయం వస్తుందో తెలిపారు.