వరంగల్​లో కార్పొరేటర్లకు దళిత బంధు

వరంగల్​లో కార్పొరేటర్లకు దళిత బంధు
  • ఇద్దరికి కార్లు పంపిణీ చేసిన ఎంపీ పసునూరి దయాకర్​
  • ఓసీటీ గ్రౌండ్​లో 100 మందికి వాహనాలు, షాపుల కేటాయింపు
  • కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన కార్పొరేటర్‍ భర్త
  • ఇవేవి పట్టించుకోని అడిషనల్‍ కలెక్టర్‍, ఎంపీ, ఎమ్మెల్యే

వరంగల్‍/వరంగల్ సిటీ, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం పేద దళితుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు స్కీంను.. వరంగల్​లో ఇద్దరు అధికార పార్టీ కార్పొరేటర్లకు అందించారు. వరంగల్​తూర్పు నియోజకవర్గంలోని18వ డివిజన్​కార్పొరేటర్​వస్కుల బాబు, 37వ డివిజన్​కార్పొరేటర్​ వెల్పుగొండ సువర్ణలు పేద దళితుల జాబితాలో వీటిని దక్కించుకున్నారు. వీరితోపాటు టీఆర్‍ఎస్‍ కార్యకర్తలుగా చెలామణి అవుతున్న ఫైనాన్షియర్లు, ఆర్థికంగా బలంగా ఉన్న జక్కం దాస్‍, పీఆర్‍ సాల్మాన్‍, టీఆర్‍ఎస్‍ 20వ డివిజన్‍ కార్పొరేటర్‍ గుండేటి నరేందర్‍ అనుచరుడు సోనూలకు పథకంలో అవకాశం కల్పించారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని వరంగల్‍ ఓసీటీ గ్రౌండ్​లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్​ఎంపీ పసునూరి దయాకర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జిల్లా అడిషనల్‍ కలెక్టర్‍ హరిసింగ్‍ పాల్గొన్నారు. మొత్తం100 మందికి  దళిత బంధు పథకం వర్తింపజేశారు. 37 మందికి కార్లు, టాక్ర్టర్లు, టాటా గూడ్స్​ఇవ్వగా.. 63 మందికి వివిధ షాపులను కేటాయించారు. కాగా, ఇరువురు కార్పొరేటర్లకు​ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే నరేందర్ ​కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పసునూరి దయాకర్‍ మాట్లాడుతూ.. దళితబంధు స్కీంలో వాహనాలు దక్కించుకున్నవారు.. పార్టీ మీటింగులు జరిగే సమయాల్లో వాటిని తీసుకురావాలని చెప్పడం గమనార్హం.  

దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం  
సీఎం కేసీఆర్​అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ పసునూరి దయాకర్​అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మొట్టమొదటిసారి దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గత  ప్రభుత్వాలు దళితులను పట్టించుకోలేదన్నారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్‍ మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే.. సీఎం కేసీఆర్​దళిత బంధు ప్రవేశపెట్టారన్నారు. గతంలో తూర్పు నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కనీసం ప్రజలను పట్టించుకోలేదన్నారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. త్వరలో రెండో విడత కింద 2 వేల మందికి స్కీమ్​వచ్చేలా కృషి చేస్తానన్నారు. త్వరలో అజాంజాహి మిల్‍ గ్రౌండ్‍లో వరంగల్‍ కలెక్టరేట్‍ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

భార్యలు కార్పొరేటర్లు.. భర్తల పెత్తనం
వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో మహిళలు కార్పొరేటర్లుగా ఉన్నచోట భర్తల పెత్తనం సాగుతోందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం అధికారంగా నిర్వహించే దళితు బంధు పథకంలో అడిషనల్​కలెక్టర్​హరిసింగ్ సాక్షిగా..19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భర్త ఓని భాస్కర్​సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. డిప్యూటీ మేయర్​రిజ్వానా షమీమ్​భర్త మసూద్​ పాల్గొన్నారు. అలాగే 24వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన భర్త గందె నవీన్ కూడా పాల్గొన్నారు. మహిళా డివిజన్ల పరిధిలో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో కార్పొరేటర్లకు బదులుగా వారి భర్తలు పాల్గొంటున్న అధికారులు, ఎమ్మెల్యేలు సమర్థించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.