- కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో ఘటన
- బోనాలు ఎత్తుకొని ఎల్లమ్మ గుడికి చేరిన దళిత మహిళలు
- అడ్డుకొని తాళాలు వేసిన గౌడ మహిళలు
- రాత్రి 12 నుంచి తెల్లవారి 3 గంటల దాకా ఎదురుచూసినా గుడిలోకి నో ఎంట్రీ
- బోనాలతో పెగడపల్లి మెయిన్ రోడ్డుపై బైఠాయింపు
పెద్దపల్లి, వెలుగు: రేణుక ఎల్లమ్మ బోనాల్లో కుల వివక్ష బయటపడింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో సోమవారం రాత్రి రేణుక ఎల్లమ్మ బోనాలు జరిగాయి. ఇందులో గౌడ కులస్తులు, దళిత మహిళలకు మధ్య బోనాల సమర్పణ విషయంలో అభిప్రాయాల భేదాలు రావడంతో గొడవ పెరిగి రాస్తారోకోకు దారితీసింది.
దళిత మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడ కుల మహిళలు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బోనాలతో గుడికి చేరుకున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన దళిత మహిళలు బోనాలు ఎత్తుకొని ఆలయానికి చేరుకున్నారు.
దీంతో గౌడ మహిళలు వారిని గేటు వద్దనే ఆపి ఆలయంలోకి రావద్దని, తమ పూజలు పూర్తయిన తర్వాత బోనాలు సమర్పించాలంటూ గేటుకు తాళాలు వేశారు. ఈ విషయమై దళిత మహిళలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చెప్పినా గౌడ కులస్తులు గేటు తీయకుండా రాత్రంగా దళిత మహిళలను గేటు బయటే నిలబెట్టారు.
తెల్లవారుజామున దేవతకు బలి కార్యక్రమం పూర్తయినా గేటు తీయలేదు. దీంతో అసహనానికి గురైన దళిత మహిళలు మెయిన్ రోడ్డుకు చేరుకొని బైఠాయించారు. 4 గంటల వరకు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్‌కుమార్, రంజిత్, ఎస్సైలు, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తమను అవమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత మహిళలు డిమాండ్ చేశారు. విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని డీసీపీ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. బాధిత మహిళ అసంపల్లి స్వరూప ఫిర్యాదు మేరకు పెగడపల్లి గ్రామానికి చెందిన 20 మంది గౌడ కులస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
