
- ఉక్రెయినే పేల్చివేసిందన్న రష్యా
- వందలాది ఊర్లు, టౌన్లకు వరద ముప్పు
- పర్యావరణానికీ ప్రమాదం
- రష్యా టెర్రరిస్ట్ దేశం అంటూ ఐసీజేలో ఉక్రెయిన్ కేసు
కీవ్/మాస్కో/ది హేగ్: ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని ఖేర్సన్ ఓబ్లాస్ట్ ప్రావిన్స్ లో ఉన్న ఒక భారీ డ్యామ్ ను బాంబులతో పేల్చివేశారు. దినిప్రో నదిపై నోవా కఖోవ్కా సిటీ వద్ద ఉన్న డ్యామ్ ను మంగళవారం తెల్లవారుజామున బాంబులతో పేల్చివేయడంతో దాని ఆనకట్ట పూర్తిగా ధ్వంసమైంది. ఖేర్సన్ ప్రాంతం ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉంది. డ్యామ్ ను రష్యానే పేల్చివేసిందని ఉక్రెయిన్ ఆరోపించగా, ఇది ఉక్రెయిన్ పనేనంటూ రష్యా కౌంటర్ ఇచ్చింది. డ్యామ్ పేల్చివేత నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మంగళవారం అత్యవసరంగా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రష్యన్ బలగాలు తెల్లవారుజామున 2.50 గంటలకు డ్యామ్ ను బాంబులు పెట్టి పేల్చివేశాయని జెలెన్ స్కీ ఆరోపించారు. రష్యా దుశ్చర్యతో వందలాది ఊర్లు, టౌన్లు ప్రమాదంలో పడ్డాయన్నారు. కొద్ది గంటల్లోనే వేలాది జంతువులు, ఎకో సిస్టమ్స్ నాశనమయ్యాయని జెలెన్ స్కీ సీనియర్ అడ్వైజర్ మైఖాయిలో పోడోల్యాక్ చెప్పారు. 1956లో కట్టిన ఈ డ్యామ్ ధ్వంసం కావడంతో ఇక్కడి జలవిద్యుత్ కేంద్రం కూడా పూర్తిగా నాశనం అయింది. దీనిని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
వేలాది మందికి వరద ముప్పు
డ్యామ్ ధ్వంసం కావడంతో దిగువన నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ అటు ఉక్రెయిన్, ఇటు రష్యన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదికి ఇరువైపులా వందలాది ఊర్లు, పట్టణాలకు వరద ముప్పు ఉందని ఉక్రెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు వారం తర్వాతే తగ్గుముఖం పడతాయని, అప్పటివరకూ వేలాది మంది నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడం వల్ల జంతుజాలం పెద్ద ఎత్తున నశిస్తుందని, పర్యావరణానికీ ప్రమాదమన్నారు. డ్యామ్‌కు ఎగువవైపున ఉన్న జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌కు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. డ్యామ్‌లో నీటి మట్టం తగ్గితే ఎగువన నదిలోనూ నీళ్లు తగ్గిపోతాయని, దీంతో ప్లాంట్‌లో కూలింగ్ కోసం నీళ్లకు కొరత ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్‌కు అడ్డంకి.. క్రీమియాకు నీటి కొరత
కఖోవ్కా డ్యామ్ నుంచే దక్షిణాదిన రష్యా అధీనంలో ఉన్న క్రీమియా ప్రాంతానికి తాగునీటి సరఫరా జరుగుతున్నందున, ఇప్పుడు డ్యామ్ ధ్వంసమవడంతో క్రీమియాకూ నీటి కొరత ఏర్పడనుంది. దక్షిణాదిలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో కొన్నాళ్లుగా ఉక్రెయిన్ బలగాలు ముందుకు దూసుకెళ్తున్నాయి. కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో ఉక్రెయిన్ బలగాలకు ఆటంకం ఏర్పడనుంది. కాగా, ధ్వంసమైన డ్యామ్ నుంచి నీళ్లు పెద్ద ఎత్తున నదిలోకి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరదతో ఓ రోడ్డు మునిగిపోవడం, బీవర్ వంటి కొన్ని జంతువులు తీరంవైపు మరింత పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటం వంటి దృశ్యాలు వీడియోల్లో కన్పించాయి.
రష్యాపై ఇంటర్నేషనల్ కోర్టులో మళ్లీ కేసు
ఉక్రెయిన్‌లో రెబెల్స్ కు ఆయుధాలు, డబ్బును అందిస్తూ రష్యా హింసను ఎగదోస్తోందని, అది ఒక టెర్రరిస్ట్ దేశం అంటూ నెదర్లాండ్స్ లోని ది హేగ్‌లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే)లో ఉక్రెయిన్ మరో కేసు వేసింది. మంగళవారం ఉక్రెయిన్ తరఫు లాయర్లు వాదనలు ప్రారంభించారు. తూర్పు ఉక్రెయిన్‌లో 2014 నుంచి రెబెల్స్‌కు వెపన్స్, డబ్బు ఇస్తూ.. రష్యా బెదిరింపులు, టెర్రరిజానికి తెర తీసిందన్నారు. అదే ఏడాది క్రీమియాను కూడా స్వాధీనం చేసుకుందన్నారు. అలాగే 2014 జులై17న ఉక్రెయిన్‌లో మలేసియా విమానం ‘ఎంహెచ్17’ను రెబెల్స్ కూల్చివేయడంతో 298 మంది చనిపోయా రని, ఆ ఘటనకూ రష్యానే కారణమని ఆరోపించారు. ‘‘ఈ రోజు కూడా కఖోవ్కా డ్యామ్‌ను రష్యా పేల్చి వేసింది. ప్రజల ఇండ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్లను ధ్వంసం చేస్తూ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతోంది” అని స్పష్టం చేశారు. కాగా, రష్యా దాడులు మొదలుపెట్టిన మొదట్లో ఐసీజేలో ఉక్రెయిన్ కేసు వేయగా.. యుద్ధం ఆపాలంటూ ఐసీజే తీర్పిచ్చింది. అయితే, రష్యా ఈ తీర్పును పట్టించుకోలేదు.