కాంపౌండ్ వాల్ కూల్చేందుకు రూ. 50 వేలు లంచం

కాంపౌండ్ వాల్ కూల్చేందుకు రూ. 50 వేలు లంచం
  •     ఏసీబీకి చిక్కిన దమ్మాయిగూడ మున్సిపల్​కమిషనర్

కీసర, వెలుగు:  వివాదాస్పద కాంపాండ్ వాల్ ను కూల్చేందుకు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధి బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ, సుదర్శన్ అనే వ్యక్తుల మధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తుంది. సుదర్శన్ స్థలాన్ని సత్యనారాయణ ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించాడు. 

దీంతో ఆ గోడను కూల్చివేసేందుకు దమ్మాయిగూడ కమిషనర్ రాజమల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్ లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించాడు. రూ. 60వేలు లంచం డిమాండ్ చేయగా 50 వేలకు ఒప్పుకుని 15 రోజుల కిందట రూ. 20 వేలు అడ్వాన్స్ గా ఇచ్చి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. సోమవారం మిగిలిన రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ రాజమల్లయ్య ఏసీబీ అధికారులకు దొరికాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.