నారాయణ్ ఖేడ్, వెలుగు: త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎంల ఉద్యోగాల భర్తీతోపాటు, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కొత్తగా నిర్మించిన బాల సదన్ బిల్డింగ్‌ను ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. ప్రభుత్వం మహిళా, శిశు , వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.జోగిపేట, వెలుగు: ఆందోల్ లోని పురాతన దేవాలయం శ్రీ రంగనాథ స్వామివారి కల్యాణ మహోత్సవానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.
