సీజనల్​ వ్యాధులు పెరగకుండా చూడాలి : దాన కిశోర్

సీజనల్​ వ్యాధులు పెరగకుండా చూడాలి : దాన కిశోర్
  • కాలనీల్లో యాంటీ లార్వా ఆపరేషన్స్​చేపట్టాలి
  • మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ ​సెక్రటరీ దాన కిశోర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీ పరిధిలో సీజనల్​వ్యాధులు పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆరోగ్య విభాగం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా దాన కిశోర్​మాట్లాడుతూ.. దోమల వ్యాప్తిని అరికట్టాలని చెప్పారు. యాంటీ లార్వా ఆపరేషన్స్ ను విస్తృతంగా చేపట్టాలని, వైరల్​ఫీవర్లు, సీజనల్​వ్యాధులపై కాలనీల్లో అవగాహన చేపట్టాలని ఆదేశించారు. శానిటేషన్ కోసం ప్రతి కాలనీలో వాలంటీర్​వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 268 బస్తీ దవాఖానలను డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్​మెడికల్ ఆఫీసర్లు రోజూ సందర్శించాలని, డెంగ్యూ కేసుల వివరాలు సేకరించాలని స్పష్టం చేశారు. డెంగ్యూ కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వానా కాలంలో క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చాలా కీలకమన్నారు. జూన్ నెలాఖరు నాటికి 148 డెంగ్యూ వచ్చాయని, గతేడాదితో పోలిస్తే డెంగ్యూ కేసులు చాలా తగ్గాయని చెప్పారు.