
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీల జపం చేసేలా చేశామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో బీసీలను బలమైన రాజకీయ కేంద్రంగా తయారు చేస్తున్న తమ నాయకత్వాన్ని అపహాస్యం చేస్తూ నరుకుడు గాళ్లు అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం బాగ్‌లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలలో వస్తున్న చైతన్యాన్ని చూసి బీఆర్ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. నియోజకవర్గాల వారీగా బీసీల జనాభా శాతాన్ని బీసీ రాజ్యాధికార సమితి బయట పెట్టడం కేసీఆర్‌కు రుచించడం లేదని, అందుకే బీసీ నాయకత్వం మీద అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక్క రోజులో ఏర్పాటు కాలేదని, అలాగే బీసీల రాజ్యం కూడా ఎంతో దూరంలో లేదన్న విషయాన్ని కేసీఆర్ గమనించాలన్నారు. బీసీల నాయకత్వాన్ని అవమానిస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్ ఉరుమల్ల విశ్వం, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి పాల్గొన్నారు.